కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

14 Sep, 2021 15:26 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌   

ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌ వ్యాఖ్య 

ధాన్యం కొనలేని సీఎం ఎందుకు: సంజయ్‌ 

మెదక్‌జోన్‌/మెదక్‌రూరల్‌: తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని బీజేపీ సీనియర్‌ నేత, ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, అవినీతి ప్రభుత్వం అంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం అనుకున్నంత అభివృద్ధి చెందకపోవడానికి కారణం కేసీఆరేనని విమర్శించారు. రాష్ట్రంలో 1.35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఉద్యోగాల్లేక యువత అల్లాడిపోతున్నా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్రలో రమణ్‌సింగ్‌ పాల్గొన్నారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా సోమవారం మెదక్‌జిల్లా కొల్చారం మండలం పొతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణలో చీకటి పోతుంది. సూర్యుడు వస్తాడు. కమలం వికసిస్తుంది’ అని రమణ్‌సింగ్‌ అన్నారు. నరేంద్రమోదీ ఆరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు కాంగ్రెస్‌ 60 ఏళ్లు పాలించినా చేయలేకపోయిందని ఆరోపించారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రజావసరాలకు ఉపయోగపడేంత ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయలేని సీఎం  ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు.  

కేసీఆర్‌ అవినీతిపై చర్యలు తప్పవు: శోభా కరంద్లాజే 
కేంద్రం సంక్షేమ పథకాల పేరిట డబ్బులు మంజూరు చేస్తుంటే కేసీఆర్‌ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే విమర్శించారు. కేంద్రం అమలుచేస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరు మార్చి రైతుబంధు అని పెట్టారన్నారు. కేసీఆర్‌ అవినీతిపై సరైన సమయంలో చర్యలు తీసుకొని, పూర్తి ఆధారాలతో ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు. సోమవారం  మెదక్‌ మండలం మంబోజిపల్లి గీతా పాఠశాల ఆవరణలో ఆమె బండి సంజయ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు