డీఎన్‌ఏ పరీక్షకు నేను సిద్ధం.. కేసీఆర్‌ సిద్ధమా? 

19 Jan, 2021 00:39 IST|Sakshi
చంద్రశేఖర్‌కు కండువా కప్పుతున్న తరుణ్‌చుగ్‌. చిత్రంలో బండి సంజయ్, డీకే అరుణ, కె.లక్ష్మణ్‌ తదితరులు

హిందుత్వ ఎజెండాపై ‘సాగర్‌’ఉప ఎన్నికకు వెళ్దాం 

సిసలైన హిందువు ఎవరో తేలిపోతుంది.. 

వికారాబాద్‌ సభలో సంజయ్‌ తీవ్ర విమర్శలు  

బీజేపీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌  

సాక్షి, వికారాబాద్‌: ‘బండి సంజయ్‌ అసలైన హిందువు కాదు, డీఎన్‌ఏ పరీక్ష చేసుకోవాలని టీఆర్‌ఎస్‌లోని కొంత మంది మొరుగుతున్నారు. నేను డీఎన్‌ఏ పరీక్ష చేసుకునేందుకు సిద్ధం, మరి పెద్ద హిందువును అని చెప్పుకున్న నీవు డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమా? హిందువు ఎవరో, బొందుగాడు ఎవరో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో తేల్చుకుందామా?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌కు సవాలు విసిరారు. ‘హిందుత్వ ఎజెండాపై నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో పోటీకి వెళ్దాం.. సిసలైన హిందువు ఎవరో అక్కడ తేలుతుంది’అని అన్నారు. సోమవారం సాయంత్రం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ ఈ సందర్భంగా బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, బండి సంజయ్‌.. కండువా కప్పి చంద్రశేఖర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రశేఖర్‌తోపాటు ఆయన అనుచరులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరారు. సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. అమరుల త్యాగాల పునాదుల మీద కేసీఆర్‌ సీఎం పదవిని అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి: (లక్షన్నర మందితో కేసీఆర్‌ సభ!)

2023లో బీజేపీ జెండా ఎగురవేస్తాం..  
2023లో గోల్కొండ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగురవేస్తామని సంజయ్‌ ధీమా వ్యక్తంచేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీలో 80 శాతం కృషి కేసీఆర్‌దే ఉన్నట్లు ప్రచారం చేసుకోవటం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 13,500 కంపెనీలు తీ సుకువచ్చి 3 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు కేసీఆర్‌ చెబుతున్నారని, ఇది రుజువు చేస్తే కేసీఆర్‌కు పాదపూజ చేస్తానని అన్నారు.  లేదంటే బడితె పూజచేస్తానని హెచ్చరించారు.  

మాఫియాతో పోల్చటం సిగ్గుచేటు 
బీజేపీ మాఫియా పార్టీ అని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించటం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ అన్నారు. కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి గురించి ప్రశ్నిస్తే బీజేపీని మాఫియాగా అభివర్ణించటం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ పాలనలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీనేత స్వామిగౌడ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పని అయిపోయిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ అన్నారు. బీజేపీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, ఏప్రిల్‌ 1న  కేసీఆర్‌ ఓ దళితున్ని సీఎంగా ప్రకటించే అవకాశం ఉందని,  వివరాలు త్వరలో బహిర్గతం చేస్తానని తెలిపారు. బహిరంగ సభలో బీజేపీ నాయకులు ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌. ప్రభాకర్, బంగారు శ్రుతి, సాయన్న, సదానందరెడ్డి, నరసింహారెడ్డి, ప్రహ్లాదరావు, మాధవరెడ్డి, శివరాజ్, పాండు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు