యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా శర్మ.. మోదీకి అత్యంత ఆప్తుడు

20 Jun, 2021 03:57 IST|Sakshi

మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీకి అధిష్టానం బాధ్యతలు

లక్నో:  వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామాలు మొదలయ్యాయా?. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా తన ఆప్తుడు, మాజీ ఐఏఎస్‌ అధికారి, ఏకే శర్మను సిఫార్సు చేశారు. దీంతో శర్మ నియామకాన్ని పార్టీ అధిష్టానం ధృవీకరిస్తూ ఒక ప్రకటన రిలీజ్‌ చేసింది. 

యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ శనివారం కీలక పదవులకు సంబంధించిన నేతల పేర్లను ప్రకటించారు. శర్మతో పాటు రాష్ట్ర పార్టీ కార్యదర్శులుగా లక్నోకు చెందిన అర్చనా మిశ్రా, బులంద్‌ షహర్‌కు చెందిన అమిత్‌ వాల్మీకిని నియమిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌లో ఐఏఎస్‌ అధికారిగా పనిచేసిన ఏకే శర్మ.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కాగా, ఏకే శర్మ స్వస్థలం యూపీలోని మావ్‌.

వైబ్రంట్‌ గుజరాత్‌ తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, అప్పటి గుజరాత్‌ సీఎం నరేంద్ర మోదీకి చేరువయ్యాడు శర్మ. ఆమధ్య తన నియోజకవర్గం వారణాసిలో కరోనా సమీక్ష కోసం శర్మనే, నరేంద్ర మోదీ పంపడం చర్చనీయాంశంగా మారింది.  అంతేకాదు ఈమధ్య యూపీ కేబినేట్‌ విస్తరణ ఊహాగానాల్లో ఏకే శర్మకు స్థానం దక్కుతుందని అంతా భావించారు కూడా. ఇక తన నియామకంపై ఏకే శర్మ ప్రధానికి, పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా, ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. పార్టీని పటిష్టం చేయడంపై చర్చించామన్నారు. కాగా, వీరిది మర్యాదపూర్వక భేటీ అని అధికార వర్గాలు తెలిపాయి. యోగి హయాంలో యూపీ పాలనపై, కరోనా కట్టడిలో విఫలమయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం మార్పులు చేయబోతోందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అదంతా మీడియా సృష్టేనని బీజేపీ నేతలు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తేల్చేశారు.

చదవండి: యోగికి బెదిరింపు కాల్‌

మరిన్ని వార్తలు