మాజీ మంత్రి ‘కాలవ’ హైడ్రామా

29 Aug, 2021 14:38 IST|Sakshi
కాలవను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

బొమ్మనహాళ్‌(అనంతపురం జిల్లా): అనుమతుల్లేకుండా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలంటూ ఉద్దేహాళ్‌ నుంచి బొమ్మనహాళ్‌కు పాదయాత్ర చేపట్టారు. ఇందుకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి, అనుచరులతో కలిసి పాదయాత్రగా ఉప్పరహాళ్‌ క్రాస్‌ వద్దకు చేరుకున్న కాలవను కళ్యాణ దుర్గం ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ఆంథోనప్ప, సీఐ రాజా, ఎస్‌ఐలు రమణారెడ్డి, రామకృష్ణారెడ్డి కలిసి మాట్లాడారు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాదయాత్ర చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. విషయం ఏదైనా నేరుగా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేయాలని సూచించారు. దీనిపై హైడ్రామాకు కాలవ తెరలేపారు.

ఇష్టం వచ్చిన రీతిలో పాదయాత్రలు, నిరసనలు, ధర్నాలు చేపడతామని, తమను ఎవరూ అడ్డుకోలేరంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో చివరకు అరెస్ట్‌ చేసి, కణేకల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా, పాదయాత్రకు మాజీ మంత్రి కాలవ  శ్రీనివాసులు తమనుంచి ఎలాంటి అనుమ తులు తీసుకోలేదని డీఎస్పీ ఆంథోనప్ప తేల్చిచెప్పారు.

శనివారం సాయంత్రం బొమ్మనహాళ్‌ ఎస్‌ఐ రమణారెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో వినతిపత్రాలు అందజేశారని, బొమ్మనహాళ్‌ మండలంలో ఇందుకు విరుద్ధంగా పాదయాత్ర చేస్తూ కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాసులును అరెస్ట్‌ చేసి, సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:
ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్‌ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు    
చిన్న పత్రికలకు అక్రిడిటేషన్‌ నిబంధనల సవరణ

మరిన్ని వార్తలు