కరోనా సోకింది, మీరంతా ఆందోళనపడొద్దు: మాజీ పీఎం

31 Mar, 2021 13:19 IST|Sakshi

కరోనా బారిన మాజీ ప్రధాని దేవెగౌడ దంపతులు

స్పందించిన కర్నాటక సీఎం, ఆరోగ్యమంత్రి

సాక్షి,  బెంగళూరు :  సీనియర్ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి  హెచ్‌డీ దేవెగౌడ ‌(87) ఆయన భార్య కరోనా బారిన పడ్డారు. ఈ  సమాచారాన్ని స్యయంగా దేవెగౌడ‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తనకు, భార్య చెన్నమ్మకు కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలిపారు. ప్రస్తుతం తాము ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హోం ఐసోలేషన్‌లో ఉన్నామని, తమతో గత కొన్ని రోజులుగా సన్నిహితంగా మెలిగినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భయపడవద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. 

దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప ట్విట్‌ చేశారు.  కరోనా నుంచి త్వరగా కోలుకుని, యథావిధిగా వారి పనికి తిరిగి వస్తారని తాను ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ స్పందిస్తూ రాజ్యసభ ఎంపీ మాజీ ప్రధాని దేవెగౌడ్‌,ఆయన భార్యకు కరోనా సోకిందని తెలిసింది. ఈ నేపథ్యంలోవారికి చికిత్స చేస్తున్న వైద్యులతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని ట్వీట్‌  చేశారు.  వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు.  

కాగా దేశంలో  కరోనా వైరస్‌ రెండవ దశలో మళ్లీ విజృంభిస్తోంది. కర్ణాటక సహా, మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కర్నాటకు సంబంధించి సీనియర్ రాజకీయ నాయకులు సిద్ద రామయ్య, బీఎస్‌ యడ్యూరప్ప, డీకే శివకుమార్ కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు