టీడీపీలో రాజీనామా బ్లోఅవుట్‌

8 Nov, 2020 12:16 IST|Sakshi
రమేష్‌రెడ్డి, అనురాధ

పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి తాళ్లపాక దంపతులు

ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలోనే..

ఆనం జయకుమార్‌రెడ్డి అసంతృప్తి గళం

రాష్ట్ర కమిటీలో సీనియర్లకు మొండిచేయి 

జిల్లా తెలుగుదేశం పార్టీలో సీనియర్ల రాజీనామాల బ్లోఅవుట్‌ ఎగిసిపడుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా ఒకలా.. అధికారం కోల్పోయాక మరోలా వ్యవహరించడం పరిపాటే అని మరోమారు తన నిజరూపాన్ని చాటుకుంది. అధికారంలో ఉన్నప్పుడు బీసీ, మైనార్టీలను అణగదొక్కిన ఆ పార్టీ తాజాగా పార్టీ సంస్థాగత పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇటీవల బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలకు వైఎస్సార్‌సీపీ అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా టీడీపీ బీసీలకు విలువలు, ఉపయోగాలు లేని పదవులు కట్టబెట్టింది. జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న రెడ్డి్డ సామాజిక వర్గ సీనియర్‌ నేతలను పక్కన పెట్టడంతో అసంతృప్తి రాజుకుంది. (చదవండి: టీడీపీ నేతల కుట్ర భగ్నం..)

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రతిపక్ష టీడీపీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. జిల్లాలో పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన నేతలకు మొండి చేయి చూపారు. తాజాగా పార్టీ రాష్ట్ర కమిటీ, పార్లమెంట్‌ అధ్యక్షుల ప్రకటన అసమ్మతి రేపింది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చేస్తున్న వారిని, గత ఎన్నికల్లో పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయిన వారిని సైతం పార్టీ పూర్తిగా పక్కన పెట్టింది. జిల్లా పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతల కనుసన్నల్లోకి పార్టీ వెళ్లడంతో తీవ్ర గందరగోళం రేగింది. 1982 నుంచి పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రి తాళ్లపాక రమేష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనూరాధ పార్టీ క్రియా శీలక సభ్యత్వాలకు రాజీనామాలు చేయడం జిల్లాలో ప్రకంపనలు మొదలయ్యాయి.  

టీడీపీ ఆవిర్భావం నుంచి దివంగత ఎన్టీఆర్‌ కుటుంబంతో తాళ్లపాక రమేష్‌రెడ్డికి అనుబంధం ఉంది. అఖిల భారత ఎన్‌టీ రామారావు సంఘం జాతీయ అధ్యక్షుడిగా రమేష్‌రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావంతో క్రియా శీలక రాజకీయాల్లోకి రమేష్‌రెడ్డి వచ్చారు. 
ప్రస్తుతం జిల్లాలో ఉన్న సీనియర్‌ నేతలు ఒకరిద్దరు మినహా మిగిలిన వారెవరూ అప్పట్లో పార్టీలో కూడా లేని వారే.  ఇలాంటి తరుణంలో జిల్లాలో పార్టీని నమ్ముకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. 
రమేష్‌రెడ్డి రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, రమేష్‌రెడ్డి భార్య అనురాధ నెల్లూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 
ఆ తర్వాత పదవులు లేకపోయినప్పటికీ నిస్వార్థంగా పార్టీలో పని చేసి ఆర్థికంగా కూడా పూర్తిగా నష్టపోయారు. 
ఇలాంటి తరుణంలో పార్టీని వదలకుండా రమేష్‌రెడ్డి, ఆయన భార్య అనూరాధ«లు పార్టీలో కొనసాగారు.
ప్రస్తుతం రమేష్‌రెడ్డి భార్య అనూరాధ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. గడిచిన ఎన్నికల్లో మంత్రి నారాయణ గెలుపు కోసం పని చేశారు. 
2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైనా పార్టీ కార్యక్రమాలు నిర్వహిసూ్తనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో రెండు రోజుల క్రితం టీడీపీ ప్రకటించిన సంస్థాగత రాష్ట్ర కమిటీలో ఇద్దరికి చోటు దక్కలేదు. 
క్రియాశీలకంగా పనిచేయకుండా గతంలో పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించిన వారికి మాత్రం కమిటీలో పెద్దపీట వేశారు. 
ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు దిష్టిబొమ్మలు దహనం చేసి, ఆయన్ను అనేక పర్యాయాలు తీవ్రంగా విమర్శలు చేసిన నేతకు మాత్రం కీలక పగ్గాలు అప్పగించారు.
తాజా రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తితో రమేష్‌రెడ్డి, ఆయన భార్య అనూరాధ శనివారం పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేసి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, నెల్లూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌అజీజ్‌కు లేఖ పంపారు.
ఇక నెల్లూరు రూరల్‌ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న ఆనం జయకుమార్‌రెడ్డికి కూడా పార్టీ మొండిచేయి చూపింది. ఆయన కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నారు. 
2019 ఎన్నికలప్పుడు రూరల్‌ అభ్యర్థిగా ఖరారు చేసి చివరి నిమిషంలో టికెట్‌ నిరాకరించి అబ్దుల్‌ అజీజ్‌కు ఇచ్చారు.
అయితే పార్టీలో కీలక ప్రాధాన్యంతో పాటు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పలు పర్యాయాలు హామీ ఇచ్చారు. 
కానీ తాజా కమిటీలో కనీసం నామమాత్రపు పదవి కూడా రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వారం రోజుల్లో కార్యాచరణ ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. 
ఇప్పటికే జిల్లాలో ఇదే రీతిలో అనేక మంది ముఖ్యనేతలు అసమ్మతి వ్యక్తం చేసి పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. 
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కిలారి వెంకటస్వామినాయుడు కూడా అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.  మొత్తం మీద టీడీపీలో పదవుల పందారం కొత్త తలనొప్పులకు దారి తీసింది.    

మరిన్ని వార్తలు