అనుకున్నదొకటి.. అయ్యిందొకటి

13 Jul, 2021 08:53 IST|Sakshi

కాకినాడ(తూర్పుగోదావరి): తన ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఓ హత్యా ఘటనకు కుల, రాజకీయ రంగు పులిమేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ కుంతీదేవిపేటకు చెందిన కలవల అంజిబాబు కొద్దిరోజుల కిందట స్థానికంగా జరిగిన వివాదంలో హత్యకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి సదరు ఘటనను తనకు అనువుగా మలుచుకునేందుకు ప్రయత్నించారు.

టీడీపీకి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేతో పాటు మరి కొంతమంది నేతలను రప్పించి మరీ ఇక్కడ రౌడీరాజ్యం నడుస్తుందంటూ ఆ ఘటనను వైఎస్సార్‌ సీపీకి ఆపాదించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాస్తవం వెలుగులోకి రావడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. హత్యకు గురైన కలవల అంజిబాబు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తగా నిర్ధారణ కాగా, హత్య చేసిన వ్యక్తి టీడీపీ మద్దతుదారుడేనని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే నిర్ధారించడంతో టీడీపీ అసలు రంగు బయటపడింది.

నా భర్త వైఎస్సార్‌ సీపీ కార్యకర్త 
తన భర్త వైఎస్సార్‌ సీపీ కార్యకర్త అని కలవల అంజిబాబు భార్య అనిత చెప్పారు. తన నివాసంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన వ్యక్తి తన భర్తను హత్య చేశారన్నారు. తన కుటుంబానికి ఎమ్మెల్యే ద్వారంపూడి అండగా ఉండడంతో పాటు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించారన్నారు. 

కొండబాబుకే పనిచేశాం..
అంజిబాబు హత్య కేసులో నిందితుడి తల్లి కలవల ఆదిలక్ష్మి మాట్లాడుతూ తమ కుటుంబం ఆది నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోసమే పని చేసిందన్నారు. ఇప్పుడు తాము ఎవరో తెలియదన్నట్టు వనమాడి మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడితో తమకు ఎలాంటి పరిచయాలు లేవన్నారు.

రూ.లక్ష ఆర్థిక సహాయం 
అంజిబాబు కుటుంబానికి ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే సోదరుడు, ద్వారంపూడి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ వీరభద్రారెడ్డి సోమవారం అంజిబాబు భార్య అనితకు అందజేశారు. ప్రభుత్వ సహాయాన్ని అందించడంతో పాటు పిల్లల చదువుకు సహాయం చేస్తామని వీరభద్రారెడ్డి చెప్పారు. ఆయన వెంట ట్రస్ట్‌ ఆర్గనైజర్‌ కర్రి వీర్రెడ్డి, కార్పొరేటర్లు మీసాల ఉదయ్‌కుమార్,  మీసాల దుర్గాప్రసాద్, చోడిపల్లి ప్రసాద్, కామాడి దశరధ, వాసిరెడ్డి రాంబాబు ఉన్నారు.

కలవల అంజిబాబు కుటుంబానికి రూ.లక్ష సాయాన్ని అందజేస్తున్న వీరభద్రారెడ్డి తదితరులు   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు