Gajwel MLA KCR: ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం

2 Feb, 2024 05:11 IST|Sakshi
వాకింగ్‌ స్టిక్‌ సాయంతో అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌

అసెంబ్లీ స్పీకర్‌ చాంబర్‌లో కార్యక్రమం 

భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలు 

అధినేతకు కేటీఆర్, హరీశ్‌ సహా ముఖ్య నేతల స్వాగతం

సాక్షి, హైదరాబాద్‌: గజ్వేల్‌ శాసనసభ్యుడిగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:15 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌... స్పీకర్‌ చాంబర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యేగా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారితోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. 

పార్టీ నేతల ఘన స్వాగతం 
గతేడాది డిసెంబర్‌లో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో జారి పడటంతో కేసీఆర్‌ తుంటి ఎముక విరగడం తెలిసిందే. దీంతో ఆయనకు వైద్యులు తుంటి మారి్పడి శస్త్రచికిత్స నిర్వహించారు. ఫలితంగా అప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్న కేసీఆర్‌ గురువారం ఊతకర్ర సాయంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రులు కె. తారక రామారావు, హరీశ్‌రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులతోపాటు బీఆర్‌ఎస్‌ నేతలు కేసీఆర్‌ వెంట స్పీకర్‌ చాంబర్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం అనంతరం శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలోని పీవీ హాల్‌లో కేసీఆర్‌కు పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. 

చాంబర్‌లో పనులు పూర్తికాకపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్‌... అసెంబ్లీలో తనకు కేటాయించిన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేయాలని భావించారు. అయితే వసతుల కల్పన పనులు పూర్తి కాకపోవడంతో నందినగర్‌లోని తన నివాసానికి తిరిగి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా జనసమూహంలోకి వచ్చిన కేసీఆర్‌ను కలిసేందుకు బీఆర్‌ఎస్‌కు నేతలు పోటీ పడ్డారు.

whatsapp channel

మరిన్ని వార్తలు