బీజేపీ గూటికి చేరిన దినేశ్‌ త్రివేది

7 Mar, 2021 05:52 IST|Sakshi
ఢిల్లీలో శనివారం దినేశ్‌ త్రివేదీకి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న జేపీ నడ్డా

ఇలాంటి బంగారు క్షణాల కోసమే ఎదురు చూశానని వ్యాఖ్యలు 

బెంగాల్‌లో అవినీతి, హింస రాజ్యమేలుతున్నాయని ఆరోపణ

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రానికి చెందిన మరో కీలక నాయకుడు బీజేపీలో చేరారు. తృణమూల్‌ మాజీ ఎంపీ, పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన దినేశ్‌ త్రివేది శనివారం బీజేపీలో చేరారు. మమత ప్రభుత్వంలో అవినీతి, హింస రాజ్యమేలుతున్నాయని ఆరోపించిన దినేశ్‌ అందుకే తాను పార్టీ వీడినట్టుగా చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారం రోజుల్లోనే ఆయన బీజేపీ గూటికి చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌ తదితరుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా త్రివేదిపై నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు.

ఇన్నాళ్లూ రాంగ్‌ పార్టీలో రైట్‌ మ్యాన్‌ ఉన్నారని, ఇప్పుడు రైట్‌ పార్టీలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. అనంతరం దినేశ్‌ త్రివేది విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడే అసలైన మార్పు చూస్తారని అన్నారు. జీవితంలో ఇలాంటి బంగారు క్షణాల కోసమే తాను ఎదురు చూశానని వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీల్లో కుటుంబమే సుప్రీంగా ఉంటుందని, కానీ బీజేపీలో ప్రజలే సుప్రీం అని కితాబునిచ్చారు. ఆట మొదలైంది అన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ నినాదాన్ని ఎద్దేవా చేసిన త్రివేది రాజకీయాలంటే సీరియస్‌గా పని చేయాలని, కానీ మమత  రాజకీయాన్ని ఆటని చేశారని ధ్వజమెత్తారు. మరోవైపు దినేశ్‌ త్రివేది పార్టీ మారడాన్ని తృణమూల్‌ తప్పు పట్టింది. ఎన్నికల వేళ పార్టీని వెన్ను పోటు పొడిచారంది

ఒకప్పుడు దీదీకి కుడి భుజం
దినేశ్‌ త్రివేది తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌ పార్టీతో ప్రారంభించారు. ఆ తర్వాత జనతాదళ్‌లో చేరారు. అనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌లో 20 ఏళ్ల పాటు ఉన్నారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత కాలంలో  విభేదాలు తలెత్తడంతో మమత ఆయనని కేబినెట్‌ నుంచి తొలగించారు. మళ్లీ 2019లో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. ఆయనని రాజ్యసభకు పంపింది.  ఇలా ఉండగా, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలు, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన సొనాలి గుహ కూడా బీజేపీలో చేరనున్నట్టుగా సూచనప్రాయంగా వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు