కాంగ్రెస్‌లో చేరిన నల్లాల కుటుంబం 

20 May, 2022 01:06 IST|Sakshi
ఢిల్లీలో ప్రియాంకాగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్న నల్లాల దంపతులు  

ఎమ్మెల్యే సుమన్‌ అరాచకాల వల్లే టీఆర్‌ఎస్‌ను వీడినట్లు వెల్లడి 

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ప్రియాంకా గాంధీ 

సుముచిత స్థానం, సీనియర్ల మాదిరి గౌరవం ఇస్తామని ఓదెలు దంపతులకు హామీ 

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, మంచిర్యాల: టీఆర్‌ఎస్‌ పార్టీ నేత, చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జెడ్పీ చైర్మన్‌ భాగ్యలక్ష్మిలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల నేతృత్వంలో.. ఇద్దరు కుమారులు సందీప్, శ్రావణ్, ఇతర నేతలతో పాటు ఓదెలు దంపతులు ఢిల్లీ వచ్చారు.

గురువారం మధ్యాహ్నం 11 జన్‌పథ్‌లోని సోనియా నివాసంలో ప్రియాంక గాంధీని కలిశారు. వారందరికీ ప్రియాంక కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమంలో ఓదెలు పాత్రను ప్రియాంకకు రేవంత్‌రెడ్డి వివరించారు. జెడ్పీ చైర్మన్‌గా మరో రెండున్నరేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌ అరాచక పాలన భరించలేక భాగ్యలక్ష్మి ఆ పార్టీని వీడుతున్న విషయాన్ని తెలియజేశారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. పార్టీలో సముచిత స్థానం ఉంటుందని, సీనియర్లకు మాదిరి గౌరవం, మర్యాద ఇస్తామని ఓదెలు దంపతులకు హామీ ఇచ్చారు. 

ప్రజలంతా కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారు: ఓదెలు 
ప్రియాంకతో భేటీ అనంతరం ఓదెలు మీడియాతో మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరాచకాల వల్లే టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసినట్లు చెప్పారు. ‘మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు 2018లో పార్టీ టిక్కెట్‌ ఇవ్వలేదు. తర్వాత సుముచిత స్థానం ఇస్తారని భావించినా ఇవ్వలేదు.

నా భార్యకు జెడ్పీ చైర్మన్‌ పదవి ఇచ్చినా ఎలాంటి వసతులు, పాలనాధికారాలు కల్పించలేదు. ప్రొటోకాల్‌ పాటించడం లేదు. రెండేళ్లుగా ఎమ్మెల్యే సుమన్‌ మా ఇంటిపై నిఘా పెట్టి జైలుకు పంపుతానని హెచ్చరిస్తున్నాడు. ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నడు. బెదిరింపు మెసేజ్‌లు పెడుతున్నాడు. ఇవన్నీ భరించలేకే బయటకు వచ్చాం..’అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యత దక్కడం లేదని, మంత్రివర్గంలోనూ అందరూ ద్రోహులే ఉన్నారని ఆరోపించారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ అనంతరం ప్రజలంతా కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్న భావనతో ఉన్నారని తెలిపారు.

కేసీఆర్‌ నాయకత్వాన్ని తిరస్కరించాలి: రేవంత్‌రెడ్డి 
తెలంగాణ కలను సాకారం చేసిన సోనియాకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజం గుర్తించి కాంగ్రెస్‌ వైపు నడుస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే మాదిగల జీవితాలు బాగుపడతాయని, మాదిగ రిజర్వేషన్‌ సాధ్యమవుతుందని భావించారని, కానీ వారి ఆశలు అడియాశలయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని తిరస్కరించాల్సిన సమయం అసన్నమయిందని చెప్పారు.  

మూడుసార్లు ఎమ్మెల్యే.. 
ఓదెలు ఉద్యమం నాటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారు. 2009, 2010 (ఉప ఎన్నిక), 2014 ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా పని చేశారు. 2018లో టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా టీఆర్‌ఎస్‌ కార్యకర్త గట్టయ్య పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలావుండగా బుధవారం సాయంత్రం వరకు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో పాల్గొన్న భాగ్యలక్ష్మి కాంగ్రెస్‌లో చేరేందుకు అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లారు. 

మరిన్ని వార్తలు