ఉచిత విద్య, వైద్యంపైనే తొలి సంతకం 

28 Nov, 2021 01:28 IST|Sakshi

బీజేపీలో సీఎం ఎవరైనా ఆ బాధ్యత నాదే: సంజయ్‌  

సెంట్‌మెంట్‌ రాజేసి, బీజేపీని అప్రతిష్టపాలు చేయడానికి కేసీఆర్‌ కుట్ర చేశారని ఆరోపణ 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని, ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఉచిత విద్య, వైద్యం ఫైల్‌పై తొలి సంతకం పెట్టించే బాధ్యత తనదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ భేటీలో సంజయ్‌ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గోల్కొండ కోటపై కాషాయజెండాను రెపరెపలాడిద్దామని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కుటుంబ–అవినీతి–నియంత పాలనపై ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు.

బీజేపీ పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని, డిసెంబర్‌ 17–20 తేదీల మధ్య రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను మొదలు పెడతామని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదనే సాకుతో ఆత్మగౌరవం సెంటిమెంట్‌ను రాజేద్దామనుకున్నారని విమర్శించారు. అపాయిట్‌మెంటే కోరలేదనే విషయం ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేయడంతో కేసీఆర్‌ కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు.

సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్‌ అపాయిట్‌మెంట్‌ పేరుతో బీజేపీని అప్రతిష్టపాల్జేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కేసీఆర్‌ రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం పదవి కోసం కేసీఆర్‌ కుటుంబంలో నాలుగు స్తంభాలాట, ప్రగతిభవన్‌ డైనింగ్‌ టేబుల్‌పై యుద్ధమే జరుగుతోందని అన్నారు.  

బీజేపీతోనే తెలంగాణ తల్లికి విముక్తి.. 
రాజకీయ పతనం ప్రారంభమైందని ఇటీవల కేసీఆర్‌కు ఒక జ్యోతిష్యుడు చెప్పగా, తెలంగాణ తల్లికి బీజేపీతోనే విముక్తి లభించబోతోందని తనకూ మరో జ్యోతిష్యుడు చెప్పారని సంజయ్‌ తెలిపారు. ఐదు శాతం ఓట్లతో బీహార్‌లో ఎంఐఎం పార్టీ 12 సీట్లు గెలుచుకుంటే, 80 శాతం హిందువులున్న తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు సాధించాలి? అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో విజయం సాధించిన ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్రకార్యవర్గం,సంజయ్, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి, పార్టీ జాతీయ సంఘటనా సహకార్యదర్శి శివప్రకాష్‌ సన్మానించారు.

సమావేశంలో డీకే అరుణ, డాక్టర్‌ కె.లక్ష్మణ్, నల్లు ఇంద్ర సేనారెడ్డి, డా.వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు, స్వామిగౌడ్, పొంగులేటి సుధాకరరెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, లక్ష్మీనారాయణ, ప్రదీప్‌కుమార్, ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు