వెంటిలేటర్ల సీల్‌ కూడా తీయలేదు

12 Sep, 2020 04:07 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మండిపాటు 

నేరుగా కేంద్ర సాయం అందుకున్నవాళ్లు తెలంగాణ బిడ్డలు కాదా?

కేసీఆర్‌ ఖాతాలో వేస్తేనే ఇచ్చినట్టా?

కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదో చెప్పాలి 

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రం.. రాష్ట్రానికి ఎలాంటి సాయం చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొనడంపై కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పారాసిటమల్‌తో కరోనా తగ్గిపోతుందన్న కేసీఆర్‌కు బీజేపీ సర్కార్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ‘రాష్ట్రానికి సీఎంగా ఉండి తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. కరోనాతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూప్పకూలాయి. అయినా కేంద్రం అందుబాటులో ఉన్న వనరుల మేరకు ఎలాంటి వివక్ష లేకుండా పనిచేసింది. ఇప్పటివరకు తెలంగాణకు 13.85 లక్షల ఎన్‌ –95 మాస్క్‌లు, 2.41 లక్షల పీపీఈ కిట్లు, 42 లక్షల హెచ్‌సీక్యూ మాత్రలు, లక్షలాదిగా ఆర్‌ఎన్‌ఏ టెస్ట్‌ కిట్లు, ఆర్టీ పీసీఆర్‌ కిట్లను కేంద్రం అందించింది. మొత్తం 1,400 వెంటిలేటర్లను రాష్ట్రానికి కేటాయిస్తే, కేవలం 647 వెంటిలేటర్లనే ఇచ్చిందని కేసీఆర్‌ చెబుతున్నారు. కేంద్రం ఇచ్చిన వాటిలో దాదాపు 500 వెంటిలేటర్లకు ఇంకా సీల్‌ కూడా తీయలేదు’అని విమర్శించారు.  

వాళ్లు తెలంగాణ బిడ్డలు కాదా...? 
‘పీఎం కిసాన్‌ యోజనలో భాగంగా రెగ్యులర్‌గా ఇచ్చే రూ. 6 వేలు కాకుండా, అదనంగా మరో రూ. 2 వేలను కేంద్రం ఇచ్చింది. జన్‌ ధన్‌ యోజన స్కీం కింద మహిళల ఖాతాల్లో రూ. 5 వందలు చొప్పున మూడు నెలలు జమ చేసింది. కేంద్రం నుంచి లబ్ధిపొందిన రైతులు, మహిళలు, కార్మికులు తెలంగాణ బిడ్డలు కాదా?.. కేసీఆర్‌ ఖాతాలో వేస్తేనే రాష్ట్రానికి ఇచ్చినట్లా?. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద వలస కార్మికులను ఆదుకునేందుకు రూ. 224 కోట్లు, కోవిడ్‌ అసిస్టెంట్‌ కింద రూ. 215 కోట్లు ఇచ్చాం. ప్రధాని అన్న కళ్యాణ్‌ యోజన కింద బియ్యం, పప్పు దినుసులు అందించాం. ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చాం’అని అన్నారు.  

ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చరు? 
ఆయుష్మాన్‌ భారత్‌ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తుండగా.. తెలంగాణలో ఎందుకు లేదని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. కనీసం ఆరోగ్యశ్రీలోనైనా కరోనా చికిత్సను ఎందుకు చేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ కిట్స్‌లో రూ. 6 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని గుర్తు చేశారు. సచివాలయం కూల్చే విషయంలో ఉన్న శ్రద్ధ కోవిడ్‌ నివారణ మీద ఉంటే బాగుడేందని విమర్శించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల మాత్రం చాలా శ్రమిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు లేవనెత్తే అంశాలకు పార్లమెంట్‌లో సమాధానం చెబుతామన్నారు. కాగా, ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు జరుగుతుందని కిషన్‌ రెడ్డి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు