ఈశాన్య రాష్ట్రాల్లో 20 విమానాశ్రయాలు

13 Sep, 2021 02:13 IST|Sakshi

పర్యాటక రంగ అభివృద్ధే లక్ష్యం 

మౌలిక సదుపాయాల ప్రణాళికల రూపకల్పనకు మంత్రుల సదస్సు 

జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు 

స్విట్జర్లాండ్‌ బదులు ఇక్కడే సినిమా షూటింగులు జరపొచ్చు 

సాక్షి ఇంటర్వ్యూ లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి 
ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి పెద్ద ఊపును ఇవ్వడంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఇరవై విమానాశ్రయాలను అభివృద్ధి చేయబోతున్నామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయని చెప్పారు. ఇప్పటికే రోడ్డు, రైలు కనెక్టివిటీని పెంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

గువాహటిలో సోమ, మంగళవారాల్లో ‘అష్టలక్ష్మి’(8 రాష్ట్రాలు) ఈశాన్య రాష్ట్రాల పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రుల సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.,. 

వ్యాక్సినేషన్‌ ముగిసేలోగా వసతుల కల్పన 
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నది. అయితే మనం టూరిజంపై అధికంగా ఆధారపడక పోవడం వల్ల త్వరగా కోలుకునేందుకు అవకాశాలున్నాయి. దీంతో పాటు భారత్‌లో టీకా కార్యక్రమం వేగంగా అమలవుతోంది.

అధికశాతం మందికి వ్యాక్సిన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది ముగిసేలోగా పర్యాటకరంగ అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. మౌలిక సదుపాయాల మెరుగునకు వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించుకునేందుకు, బ్రాండింగ్‌ కోసం ఈ సదస్సును ఏర్పాటు చేశాం.  

పర్యాటకాభివృద్ధికి మెండుగా అవకాశాలు 
ఇక్కడి గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో భిన్నమైనవి. వినూత్న శైలితో సాగే వీరి పండుగలు, ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడి జలపాతాలు కూడా అందమైన పరిసరాలతో ప్రకృతి రమణీయతతో విలసిల్లుతుంటాయి. లొకేషన్స్‌ కూడా అద్భుతంగా ఉంటాయి. స్విట్జర్లాండ్‌ బదులు ఇక్కడే సినిమా షూటింగులు జరపొచ్చు.

ఇలా ఇక్కడ పర్యాటకాభివృద్ధికి మెండుగా అవకాశాలున్నాయి. సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ఇక్కడ పెద్దసంఖ్యలో  సినిమాల చిత్రీకరణ జరిగేలా చొరవ తీసుకుంటాం. త్వరలో ఇక్కడ పెట్టుబడిదారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. పామాయిల్, ఇతర రంగాల్లో పెట్టుబడులు రాబడతాం. ఉపాధి కల్పన ద్వారా ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది.

సమస్యలను అధిగమించాం 
ఈశాన్య రాష్ట్రాలను 35 ఏళ్ల పాటు చొరబాట్లు, తీవ్రవాద గ్రూపుల సమస్యలు పట్టి పీడించాయి. రోజులు, నెలల తరబడి రాష్ట్రాల మధ్య రోడ్ల మూసివేత వంటివి కొనసాగేవి. ప్రకృతి రమణీయత, జలపాతాలు, ఘనమైన చరిత్ర, విభిన్న జాతులు, తెగల జీవనశైలి ఇలా అనేక అద్భుతమైన అంశాలెన్నో ఉన్నా.. పైన పేర్కొన్న సమస్యల కారణంగా సరైన మౌలిక సదుపాయాలు, రోడ్లు, రవాణా, ఇలా ఏవీ అందుబాటులో లేక పర్యాటక రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైంది. గత ఏడేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో ఆ సమస్యలు అధిగమించాం. ఇప్పటికే అనేక మార్పులు తీసుకొచ్చాం. రోడ్డు, రైలు కనెక్టివిటీ పెరిగింది. దీంతో పర్యాటకరంగ అభివృద్ధికి గట్టి చర్యలు చేపడుతున్నాం.   

మరిన్ని వార్తలు