అదొక్కటే ముందున్న మార్గం.. కాంగ్రెస్‌కు జీ–23 నేతల కీలక సూచన

17 Mar, 2022 08:14 IST|Sakshi

న్యూఢిల్లీ: నాయకులందరినీ అందరినీ కలుపుకుని ముందుకు సాగడమే కాంగ్రెస్‌ ముందున్న మార్గమని సీనియర్ల బృందం (జీ–23) అభిప్రాయపడింది. అన్ని స్థాయిల్లోనూ నిర్ణయాల్లో వారిని భాగస్వాములను చేయాలని సూచించింది. 24 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సమర్థమైన ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసేందుకు భావసారూప్యత ఉన్న శక్తులతో చర్చలు జరపాలని బుధవారం ఒక ప్రకటనలో కోరింది.

గులాం నబీ ఆజాద్‌ నివాసంలో జీ–23 నేతలు కపిల్‌ సిబల్, ఆనంద్‌ శర్మ, పృథ్వీరాజ్‌ చవాన్, మనీశ్‌ తివారీ, శశిథరూర్, భూపీందర్‌ సింగ్‌ హుడా, వివేక్‌ టంకా, రాజ్‌ బబ్బర్, అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్, సందీప్‌ దీక్షిత్‌ తదితరులు సమావేశమయ్యారు.

కొత్తగా పటియాలా ఎంపీ ప్రణీత్‌ కౌర్, గుజరాత్‌ మాజీ సీఎం శంకర్‌సింగ్‌ వఘేలా, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్, పీజే కురియన్, కుల్‌దీప్‌ శర్మ కూడా హాజరవడం విశేషం! కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్ణయాలు, భేటీ జరిగిన తీరు తదితరాలను సీడబ్ల్యూసీ సభ్యులైన ఆజాద్, ఆనంద్‌ శర్మ నేతలకు వివరించినట్టు తెలుస్తోంది. జీ–23 నేతలు పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. వాళ్లు 100 సమావేశాలు జరిపినా పార్టీ సోనియా వెంటే ఉంటుందన్నారు.

ఓటమిపై కాంగ్రెస్‌ కమిటీ 
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మదింపుకు ఐదుగురు లీడర్లతో కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ కమిటీ వేశారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీలో చేపట్టాల్సిన వ్యవస్థాగతమైన మార్పులను సూచించాల్సిందిగా కోరారు. జితేంద్రసింగ్‌ (యూపీ), అజయ్‌ మాకెన్‌ (పంజాబ్‌), అవినాశ్‌ పాండే (ఉత్తరాఖండ్‌), రజనీ పాటిల్‌ (గోవా), జైరాం రమేశ్‌ (మణిపూర్‌)కు బాధ్యతలు అప్పగించారు. 

మరిన్ని వార్తలు