కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేతగా ‘జీ–23’ నాయకుడు!

13 Jul, 2021 07:28 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేతగా అధిర్‌ రంజన్‌ చౌదరి స్థానంలో మరొకరిని నియమించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జూలై 19 నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభాపక్ష నాయకుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు చేపట్టబోరని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. పార్టీ పనితీరుపై అంతృప్తి వ్యక్తం చేస్తూ గత ఏడాది ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసిన జీ–23 (గ్రూప్‌–23) నాయకుల్లో ఒకరిని ఈ పదవిలో నియమించే పరిస్థితి కనిపిస్తున్నట్లు పేర్కొన్నాయి.

ఈ పోటీలో శశి థరూర్, మనీష్‌ తివారీ ముందంజలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గౌరవ్‌ గొగోయ్, రవనీత్‌ బిట్టూల పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీకి లేఖ రాసిన జీ–23 నేతల్లో శశి థరూర్, మనీష్‌ తివారీ కూడా ఉన్నారు. ‘ఒక్కరికి ఒక పదవి’ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అధిర్‌ రంజన్‌ చౌదరిని లోక్‌సభాపక్ష నేత బాధ్యతల నుంచి తప్పించాలని యోచిస్తోంది. ఆయన ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవినీతిపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు కోసం పట్టుబట్టాలని కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు