ప్రజలతో మమేకం అయితేనే ప్రజాస్పందన తెలిసేది.. బాబుకి అది తెలీదు

8 Jun, 2022 15:46 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వం పట్ల లేని వ్యతిరేకతను వండి వార్చి ఇవ్వడం సరికాదని మీడియాకు హితవు పలికారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. 

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. పార్టీలకు అతీతంగా అందరి అభిప్రాయం తెలుసుకోవాలని సీఎం జగన్‌ చెప్పారు. సంక్షేమ పథకాలు అందకున్నా, ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే.. విమర్శలను స్వీకరించి పొరపాట్లను సరిదిద్దాలని నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని పేర్ని నాని వెల్లడించారు. 

టీడీపీ నేతల విమర్శలు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారంపై పేర్ని నాని స్పందిస్తూ.. అలా అనుకుంటే వాళ్ల మనుగడ కొనసాగేది!. 2019లో నేనే సీఎంగా ప్రమాణం చేస్తానంటూ చంద్రబాబు నాయుడు కొత్త బట్టలు కుట్టించుకున్నారు. పదవి ఊడేదాకా చంద్రబాబుకు విషయమే తెలియలేదు. ప్రజలతో మమేకమై ఉంటేనే కదా ఆయనకు ప్రజాస్పందన తెలిసేది. ఇప్పుడు కూడా ఊహల్లోనే బతుకుతున్నాడు.. పార్టీని బతికించాలి.. కొడుకు నాయకత్వాన్ని బతికించే తాపత్రయం తప్పా ఇంకేం కనిపించడం లేదని, ప్రజల్లోకి వెళ్తే వాస్తవ పరిస్థితి ఏంటో ఆయనకు తెలిసొస్తుందని పేర్ని నాని చెప్పారు.

మరిన్ని వార్తలు