‘ముఖం చెల్లకే అసెంబ్లీ బహిష్కరణ’

20 May, 2021 08:19 IST|Sakshi

టీడీపీపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట ధ్వజం 

కుట్రలు, సంక్షేమం చర్చకు వస్తాయని చంద్రబాబు బెంబేలు 

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నుంచి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల దాకా వరుసగా ఘోర పరాజయాలతో ముఖం చెల్లకే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను టీడీపీ బహిష్కరిస్తోందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.  ప్రభుత్వంపై చేస్తున్న కుట్రలు చర్చకు వస్తాయనే భయంతోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీకి రావడం లేదని చెప్పారు.

కరోనా ఉధృతి వల్లే సమావేశాలను ఒక రోజుకు పరిమితం చేశామని వివరించారు. అయితే దీనివల్ల ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలపై చర్చించే దమ్మూ ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. 

విధానం లేని పార్టీ టీడీపీ 
టీడీపీకి ఒక విధానం అంటూ లేదు. ఓటమి భయంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించారు. సభలు నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమయ్యారు. చివరకు ఓడిపోయి హైదరాబాద్‌లో మకాం వేశారు. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే వ్యాక్సినేషన్, ఆక్సిజన్‌ కొరతను ప్రభుత్వంపై రుద్దే యత్నం చేస్తున్నారు.  

కోవిడ్‌ నిబంధనల మేరకే అసెంబ్లీ 
కోవిడ్‌ నిబంధనల మేరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నాం. కరోనా నెగెటివ్‌ రిపోర్టు వచ్చిన వారినే సభలోకి అనుమతిస్తున్నాం. సభ్యులు భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు చేశాం. సంక్షేమ పథకాలను ప్రజలు ఆశీర్వదించడం, కరోనాను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రశంసలు అందుకోవడాన్ని చూసి తట్టుకోలేక విపక్షం అసెంబ్లీకి రాకుండా ఎగ్గొడుతోంది. రెప్పార్పకుండా రోజూ చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో  రూ.300 కోట్లతో సకల సౌకర్యాలతో నిర్మించుకున్న విలాసవంతమైన భవనంలో కూర్చుని అబద్ధాలు, అసత్యాలు వల్లె వేస్తున్నారు.

 చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేశారు. విద్య, వైద్య రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ నాడు–నేడు ద్వారా ప్రతి పీహెచ్‌సీని అభివృద్ధి చేస్తూ జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తున్నారు.  

రాజద్రోహంపై బాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం
రాజద్రోహం కేసు అనేదే వినలేదని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. ఆయన హయాంలో ఓటుకు కోట్లు వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై 12 కేసులు మోపారు. నాతోపాటు ఎంపీ మిథున్‌రెడ్డిపై ఆసుపత్రిని ప్రారంభించినందుకు ఏకంగా రాజద్రోహం కేసు పెట్టారు. తన నియోజకవర్గంలో సింగిల్‌ వార్డు కూడా గెలిపించుకోలేని యనమల రామకృష్ణుడు అసెంబ్లీ గురించి, వ్యవస్థల గురించి నీతి కబుర్లు చెప్పడం సిగ్గుచేటు.  

చదవండి: సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ మిషన్లను ప్రారంభించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు