అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకోవడం తప్పా?

12 Oct, 2022 03:56 IST|Sakshi

రాయలసీమలో హైకోర్టును అడ్డుకుంటే ఉపేక్షించేది లేదు 

శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త శ్రీకాంత్‌రెడ్డి

కడప కార్పొరేషన్‌: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోరుకోవడం తప్పెలా అవుతుందని శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త, అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. కడపలో ఆయన మంగళవారం మీడియాతో  మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న వికేంద్రీకరణ విధానంపై కొన్ని నెలలుగా ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ధ్వజమెత్తారు.

రాజధానిని ఎప్పుడు ప్రకటించారు, వీరంతా భూములు ఎప్పుడెప్పుడు కొన్నారనే విషయాలను సాక్ష్యాధారాలతో సహా అసెంబ్లీలో తాము బయటపెట్టామని ఆయన గుర్తుచేశారు. బౌన్సర్లను పెట్టుకుని యాత్రలో అసభ్యకరంగా నృత్యాలు  చేయడం విచారకరమన్నారు. పద్నాలుగేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు రాయలసీమకు చేసిందేమీ లేదన్నారు. రాయలసీమ ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయంటే అది వైఎస్సార్, ఆయన తనయుడు సీఎం జగన్‌ ఘనతేనన్నారు.  

కర్నూలులో హైకోర్టును ద్వేషించడం దారుణం 
ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటుంటే చంద్రబాబు ద్వేషించడం దారుణమని.. దానిని అడ్డుకుంటే ఉపేక్షిం చేదిలేదని హెచ్చరించారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని తీర్మానించిన బీజేపీ నాయకులు ఇప్పుడు నోరెందుకు మెదపడంలేదని నిలదీశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయం, సోమశిల ప్రాజెక్టుల వల్ల లక్షల ఎకరాల భూములు, ఊర్లను కోల్పోయిన రైతులే త్యాగధనులని, ఆకుపచ్చ కండువా వేసుకున్నంత మాత్రాన రైతులు అయిపోరని ఎద్దేవా చేశారు.

వికేంద్రీకరణవల్ల ఏ ఆఫీసు ఎక్కడికి తరలిపోకుండా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. సీపీఐ నారాయణ, రామకృష్ణలాంటి వారు 30లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్‌ జగన్‌ను ప్రశంసించకుండా, అమరావతి రైతుల కోసం పోరాటం చేయడం విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌ ఎన్నిసార్లు తన వైఖరి మార్చుకున్నారో లెక్కేలేదన్నారు. 

త్వరలో రాయలసీమ జేఏసీ ఏర్పాటు  
రాయలసీమలోని ప్రజా ప్రతినిధులు, మేధావులు, అన్ని పార్టీల నాయకులతో కలిసి రాయలసీమ జేఏసీ ఏర్పాటుచేయనున్నట్లు శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు, టీజీ వెంకటేష్‌ లాంటివారు రాయలసీమ ద్రోహులన్నారు. రాజీనామాలు తమకు కొత్త కాదని, తమ నాయకుడు ఆదేశిస్తే రాయలసీమ కోసం రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. 

మరిన్ని వార్తలు