అజ్ఞాతంలోకి చంద్రబాబు

17 Oct, 2020 05:06 IST|Sakshi

వ్యవస్థలను మేనేజ్‌ చేసే పనిలో ఉన్నారు 

అమరావతిపై సీబీఐ విచారణ అంటే ఆయనకు భయమెందుకు? 

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, అమరావతి:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ రాసిన రోజు నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. అప్పటి నుంచీ ఆయన ఎక్కడున్నాడు? ఏ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నాడు.. ఎవరితో ఏం మాట్లాడుతున్నాడనేది ప్రజలకు అర్ధమవుతూనే ఉందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి భూములపై చంద్రబాబు సీబీఐ విచారణను ఎందుకు కోరడంలేదని.. అదంటే ఆయనకు భయమెందుకని ప్రశ్నించారు.

అక్కడ తన బినామీ భూముల వ్యవహారం లేకపోతే తండ్రీకొడుకులు సీబీఐ విచారణ కోరవచ్చు కదా? అని అన్నారు. చంద్రబాబు ఇంటిని ముంచేయాలనుకుంటున్నారని వికృత రాతలు రాస్తున్న చంద్రబాబు తోకపత్రికకు శ్రీకాంత్‌ ఘాటుగా బదులిచ్చారు. బాబు ఇంటి కోసం నీరంతా వదిలేసి, ప్రకాశం బ్యారేజీ ఖాళీగా ఉంచాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షాలు పుష్కలంగా కురిసి రిజర్వాయర్లన్నీ నిండుగా ఉంటే కడుపు మంటతో ఏడ్చే చంద్రబాబు, లోకేశ్‌ను ఏమనాలి? అని వ్యాఖ్యానించారు. 

ఒక్క రూపాయి ఇవ్వని చంద్రబాబు 
చంద్రబాబు హయాంలో 14 లక్షల ఎకరాల పంట నష్టపోయినా ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని.. సీఎం జగన్‌ వచ్చాక, ఆ బకాయిలన్నింటినీ రైతులకు చెల్లించారని గడికోట గుర్తుచేశారు. గత పదేళ్లలో ఎన్నడూలేని విధంగా రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని.. కృష్ణా నదిలోకి 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తోందని.. వైఎస్సార్‌సీపీ నేతలంతా ప్రజల్లో ఉండి వారికి అండగా నిలబడ్డారని.. కానీ, చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని  బురదజల్లుతున్నారని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు