రమేశ్‌ ఆస్పత్రి ఘటనపై ఎందుకు మాట్లాడవు బాబూ?

11 Aug, 2020 05:24 IST|Sakshi

నిజనిర్ధారణ కమిటీని ఎందుకు వేయరు? 

మీ పార్టీకి చెందినవారికి ఒక న్యాయం.. మరొకరికి ఇంకో న్యాయమా? 

చంద్రబాబుపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట ధ్వజం

సాక్షి, అమరావతి: విజయవాడలో రమేశ్‌ ఆస్పత్రికి చెందిన కోవిడ్‌ సెంటర్‌ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మృతి చెందితే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. విశాఖలో ఏం జరిగినా ప్రభుత్వ వైఫల్యమనే ఆయన అగ్నిప్రమాదంపై మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. తన పార్టీకి చెందినవారికైతే ఒక న్యాయం.. మరొకరికైతే మరో న్యాయమా అని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో శ్రీకాంత్‌రెడ్డి ఏమన్నారంటే.. 

► చంద్రబాబు జూమ్‌ మీటింగ్‌లో డాక్టర్‌ రమేశ్‌ చౌదరి టీడీపీ వారియర్‌నంటూ పాల్గొని ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు చేపట్టట్లేదని బురద జల్లారు. అవి తన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమయ్యాయి? ఆయన నిర్లక్ష్యం వల్లే 10 మంది మరణించడం వాస్తవం కాదా? 
► రమేశ్‌ ఆస్పత్రి ఘటనపై బాబు నిజనిర్ధారణ కమిటీ ఎందుకు వేయలేదు?  
► ఈ ఘటనను రాజకీయం చేసే ఉద్దేశం మాకు లేదు. ఏదైనా ఘటన జరిగినప్పుడు అందులో తన మనుషులు, తన పార్టీకి చెందిన వాళ్ల ప్రమేయం ఉంటే ఒకలా, లేకుంటే మరోలా స్పందించడం బాబు నైజం.   
► ప్రతి విషయంలో కుల రాజకీయాలు చేయడం, కులాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం బాబుకు అలవాటు.  
► ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక విచారణలో స్పష్టంగా ఆస్పత్రి యాజమాన్యానిదే తప్పని అధికారులు చెబుతున్నారు. 
► 48 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక రాగానే తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. రాయలసీమ గురించి మాట్లాడే హక్కు లోకేశ్, చంద్రబాబుకు లేదు. 

మరిన్ని వార్తలు