సంక్షేమం, అభివృద్ధి సీఎం జగన్‌కు రెండు కళ్లు

17 Mar, 2021 04:15 IST|Sakshi

పారదర్శక రాజకీయాలే ఆయన లక్ష్యం 

బాబూ నీచ రాజకీయాలు మానుకో.. 

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

సాక్షి, అమరావతి: సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లలా చేసుకుని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు కాబట్టే మునిసిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రచారం లేకుండా స్పందించిన వ్యక్తి జగన్‌ అని, అందుకే ఆయనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెప్పారు.   

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం 
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఈసీపై తమకు వ్యక్తిగతంగా ద్వేషం లేదని, ఓ రాజకీయ పార్టీ నేతలతో హోటల్‌లో భేటీ అవ్వడాన్ని, ఓ పార్టీకి కొమ్ము కాయడాన్ని మాత్రమే నిలదీశామన్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ గెలిస్తే ఈవీఎంలు మోసం చేశాయని చంద్రబాబు చెప్పాడని, ఈవీఎంలను దొంగిలించిన చరిత్ర ఆయనదేనని ఎద్దేవా చేశారు. బ్యాలెట్‌తో, పార్టీ గుర్తుపై జరిగిన పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిందన్నారు.  వైఎస్‌ జగన్‌ అమరావతిని తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడలేదని, చంద్రబాబు మాత్రం ప్రాంతానికో మాట చెప్పాడని గుర్తు చేశారు.

చంద్రబాబూ.. దమ్ముంటే విచారణకు సిద్ధపడు 
చంద్రబాబును సీఐడీ విచారణకు రమ్మని నోటీసులిస్తే ఇష్టానుసారం మాట్లాడటం దుర్మార్గమన్నారు. విచారణ జరగకుండా ఎక్కడైనా క్లీన్‌చిట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది కోర్టులను అవమానపర్చడమేనన్నారు. బాబుకు స్టేల బాబు అనే పేరుందని, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా విచారణకు సిద్ధపడాలన్నారు.

అసెంబ్లీ సమావేశాలపై అస్పష్టత
రాష్ట్రంలో ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై అస్పష్టత నెలకొందని గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఆదేశాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీసుకునే నిర్ణయాన్ని బట్టి అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.  సభను ఎక్కువ రోజులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అభివృద్ధి, ప్రభుత్వ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించాలని భావిస్తున్నామని చెప్పారు.

  

మరిన్ని వార్తలు