అప్పటి మాటలు ఏమయ్యాయి? 

24 Jun, 2021 04:58 IST|Sakshi
మాట్లాడుతున్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, చిత్రంలో అమర్‌నాథ్‌రెడ్డి, సురేష్‌బాబు

తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలపై చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మండిపాటు 

కేసీఆర్‌ జోక్యం చేసుకుని ఆ మాటలను ఉపసంహరింప చేయాలి 

మా కోటా మేరకే నీటిని వాడుకుంటే మీకేంటి నష్టం? 

ఇంత జరుగుతుంటే బాబు, లోకేష్‌ నోరు విప్పకపోవడం దారుణం 

రాజంపేట టౌన్‌: విడిపోయినా కలిసి ఉందాం అన్న తెలంగాణ నాయకుల అప్పటి మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ఆంధ్ర ప్రజలు రాక్షసులు అనడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకొని మంత్రితో తన మాటలను ఉప సంహరింప చేయించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ జిల్లా రాజంపేటలో బుధవారం ఆయన కడప మేయర్‌ సురేష్‌బాబు, వైఎస్సార్‌ సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రలో కంటే తెలంగాణలోనే అభివృద్ధి బాగా జరిగిందన్నారు. రాయలసీమ ప్రజలు రాజధానిని త్యాగం చేసి హైదరాబాద్‌ను రాజధాని చేస్తే తీరా హైదరాబాద్‌ అభివృద్ధి చెందాక, అది తెలంగాణకు వెళ్లడంతో రాయలసీమకు తీరని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

సీమ గొంతు కోస్తున్నారు.. 
తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నోరు పారేసుకోవడం సరికాదని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. ఏ హక్కుతో కృష్ణా జలాలపై మాట్లాడుతున్నాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 797 అడుగుల్లో నీరు ఉన్నప్పుడు, నాగార్జునసాగర్‌కు నీటి అవసరం లేకపోయినా కేవలం స్వార్థంతో తెలంగాణ ప్రభుత్వం పవర్‌ జనరేషన్‌ చేస్తూ రాయలసీమ గొంతు కోస్తోందని మండిపడ్డారు. అయినప్పటికీ తాము సంయమనం పాటిస్తున్నామన్నారు. కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వద్దనే కాకుండా అలంపూరు వద్ద లిఫ్ట్‌ పెట్టాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని,  అలాచేస్తే రాయలసీమ పూర్తిగా ఎడారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమకు కేటాయించిన 114 టీఎంసీలు, చెన్నైకి తాగునీటికి సంబంధించిన కేటాయింపులను మాత్రమే తాము వాడుకుంటున్నామన్నారు. ప్రాజెక్టులో నీరు 800 అడుగులకు చేరకముందే కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడేస్తున్నందున శ్రీశైలంలో పైభాగానికి నీళ్లు రావడం లేదని చెప్పారు. 840 అడుగులు చేరేంత వరకు రాయలసీమకు ఒక్క చుక్క నీరు కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పరిస్థితిని అపెక్స్‌ కమిటీలో విన్నవించారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఏపీ కోటా మేరకే నీటిని వాడుకుంటోందని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఇవ్వబోతుందని తెలిసి తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. 

బాబు, లోకేష్‌లు తెలంగాణకు మద్దతు 
వైఎస్‌ హయాంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మించే సమయంలో టీడీపీ మాజీ మంత్రి  దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేసి ఆ ప్రాజెక్టు అవసరం లేదని మాట్లాడారని శ్రీకాంత్‌రెడ్డి  గుర్తు చేశారు. ఈ రోజు చంద్రబాబు, లోకేష్,  ఉమా.. ఆంధ్రకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం దారుణమన్నారు. చంద్రబాబు, లోకేష్‌లకు ఆంధ్ర ప్రయోజనాలు పట్టవని, వారు హైదరాబాద్‌లో కూర్చొని తెలంగాణకు మద్దతు తెలుపుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. తమకు కేటాయించిన నీళ్లు తాము తీసుకోగలిగితే రాయలసీమతో పాటు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు