ఫడ్నవీస్‌కు గడ్కరీ పాఠం? 

23 Oct, 2021 14:28 IST|Sakshi

గడ్కరీ చెవిలో చెప్పారన్న రాష్ట్ర మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ 

వడెట్టివార్‌ వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర మంత్రి 

నాందేడ్‌: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు గుణపాఠం చెప్పాలని అనుకున్నారని రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్‌ నేత విజయ్‌ వడెట్టివార్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన నాందేడ్‌లో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో పై వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలను గడ్కరీ ఖండించారు. తానెప్పుడు ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. నాందేడ్‌ జిల్లాలోని డెగ్లూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌ అభ్యర్థి జితేశ్‌ అంతపూర్కర్‌ తరఫున విజయ్‌ వడెట్టివార్‌ గురువారం ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రజాపనుల శాఖ మంత్రి అశోక్‌ చవాన్‌ నాందేడ్‌ జిల్లా మంత్రే కాబట్టి ఈ జిల్లాలో రోడ్లకు మహర్దశ పట్టబోతోందన్నారు. కొద్దిరోజుల క్రితమే కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమయ్యామని, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధులు ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. నాగ్‌పూర్‌లో ఉన్న ఇద్దరు ప్రముఖులు నితిన్‌ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్‌లకు ఒకరంటే ఒకరికి పడదని ఆ నగరవాసులకు తెలుసన్నారు. గడ్కరీతో తాము సమావేశమైనప్పుడు తాను ఫడ్నవీస్‌కు గుణపాఠం చెప్పాలని అనుకున్నట్లు, సమయం వచ్చినప్పుడు చెప్పినట్లు చెవిలో చెప్పారని పేర్కొన్నారు. అయితే, ఎవరి చెవిలో గడ్కరీ చెప్పారన్నది మాత్రం వడెట్టివార్‌ స్పష్టతనివ్వలేదు. అయితే, విజయ్‌ వడెట్టివార్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ నితిన్‌ గడ్కరీ ఓ ప్రకటన విడుదల చేశారు. తానెప్పుడూ వడెట్టివార్‌ చెవిలో ఏమీ చెప్పలేదన్నారు.

చదవండి: (దీపావళి తర్వాత శివసేన ప్రక్షాళన)

అలాంటి అసత్య ప్రచారం, నిరాధార ఆరోపణలు చేయకూడదని, నీచపు రాజకీయాలకు పాల్పడకూడదని ఆ ప్రకటనలో గడ్కరీ హితవు పలికారు. ఫడ్నవీస్‌ తనకు తమ్ముడిలాంటి వ్యక్తి అని పేర్కొన్నారు. అంతేగాక, తమ పార్టీలో ఫడ్నవీస్‌ ఒక ముఖ్య నేత అన్నారు. పార్టీలో ఉన్న మరొకరి గురించి మాట్లాడటం కాంగ్రెస్‌ పార్టీ సంస్కృతి అని మండిపడ్డారు. ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుందని, ఇప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష నేతగా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో కాంగ్రెస్‌ నేతలను పక్కన పెట్టారని, అందుకే వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ జనాన్ని మభ్యపెట్టేందుకు చూస్తున్నారని నితిన్‌ గడ్కరీ ధ్వజమెత్తారు.  

మహావికాస్‌ నేతల బుర్రలు పరీక్షించాలి 
దీపావళిని రైతులకు చీకటి పండుగ చేశారు 
ఎంవీయే ప్రభుత్వంపై బీజేపీ చీఫ్‌ పాటిల్‌ మండిపాటు

ఔరంగాబాద్‌: మహావికాస్‌ ఆఘాడి (ఎంవీయే)ప్రభుత్వంలోని నేతల బుర్రలను పరీక్షించాలని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటి ల్‌ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు గుణపాఠం నేర్పాలని అనుకున్నారన్న కాంగ్రెస్‌ నేత విజయ్‌ వడెట్టివార్‌ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఆయన పైవిధంగా పేర్కొన్నారు. పర్బణీ జిల్లాలో పాటిల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. గడ్కరీ తమకు గురువు లాంటివారని అన్నారు. ఆయన ఎల్లప్పుడూ పార్టీకి, పార్టీ విధానాలకు నిబద్ధుడై ఉంటారన్నారు. ఎన్సీబీ, ఆ సంస్థ ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేలపై ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ చేస్తున్న ఆరోపణలను పాటిల్‌ ఖండించారు. గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యలూ మాలిక్‌కు తెలియవని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని బహుశా ఆయనకు ముందే తెలిసి ఉండొచ్చని, అందుకే కొత్త పని వెతుక్కుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో తుఫాన్‌ బాధిత ప్రజలు, రైతులు సహాయం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మం డిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు ఈసారి దీపావళి చీకటి పండుగగా మారిందని ధ్వజమెత్తారు. మరాఠ్వాడలో కురిసిన భారీ వర్షాల వల్ల 37.77 లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని, 11 వేల హెక్టార్లలో పంటలకు పనికి రాకుండా పోయిందని తెలి పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న ప్పుడు సర్వేలు నిర్వహించకుండానే ఆర్థిక సాయం అందజేసిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. ఇలా అయితే బాధితులకు సాయం ఎప్పుడు అందుతుందోనని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు వచ్చే నెలలో తమ చొక్కాలకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలుపుతారని చంద్రకాంత్‌ పాటిల్‌ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు