టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణకుమారి రాజీనామా

1 Oct, 2020 15:40 IST|Sakshi

సాక్షి, చిత్తూరు :  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో ఊహించని షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్‌ మహిళా నేత, మాజీమంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు.  ఈ  మేరకు ఆమె గురువారం చంద్రబాబుకు లేఖ రాసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా ఉన్నా అరుణ పార్టీలో ఎప్పుడూ చురుగ్గా వ్యవహరించలేదు.

ఆమె కుమారుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కూడా టీడీపీలో గతంలో మాదిరిగా చురుగ్గా ఉండడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గల్లా అరుణకుమారి రాజీనామా చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తెలుగుదేశం పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తున్న తరుణంలో గల్లా అరుణ కుమారి రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. 

మరిన్ని వార్తలు