బీజేపీ మాటలను నమ్మొద్దు 

12 Nov, 2021 03:22 IST|Sakshi

వానాకాలం ధాన్యం కొనుగోళ్లు మా బాధ్యతే: మంత్రి కమలాకర్‌  

కరీంనగర్‌: ధాన్యం కొనుగోళ్ల విషయంలో దొంగే దొంగ.. అన్న చందంగా బీజేపీ వ్యవహరిస్తోందని, రైతులు ఆ పార్టీ చెప్పే మాటలు నమ్మవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వానాకాలం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. యాసంగి వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ పత్రాలు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తుంటే.. వానాకాలం వడ్లను కొనుగోలు చేయాలని బీజేపీ ధర్నాలకు దిగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ నేతలు వానాకాలం వడ్లను కొనుగోలు చేయాలని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధర్నాలు చేయాల్సింది తెలంగాణలో కాదని.. ఢిల్లీలో చేసి యాసంగి వడ్ల కొనుగోళ్లకు కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుందని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో అన్ని వివరాలు చూసుకోవచ్చని బీజేపీ నేతలకు సూచించారు. 

మరిన్ని వార్తలు