Huzurabad Bypoll: నిఖార్సయిన బీసీ బిడ్డ గెల్లు.. పావలా బీసీ ఈటల

8 Sep, 2021 08:11 IST|Sakshi

పద్మశాలీల సంక్షేమానికి అండగా ప్రభుత్వం: గంగుల

సాక్షి, హుజూరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ నిఖార్సయిన బీసీ బిడ్డ అని, ఈటల పావలా బీసీ అని బీసీ సంక్షేమ సంఘం, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ ఎద్దేవా చేశారు. పద్మశాలీల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, పద్మశాలీ కులబాంధవులు ఏకతాటిపై నిలిచి గెల్లు గెలుపునకు కృషి చేయాలని కోరారు. మంగళవారం హుజురాబాద్‌ పట్టణంలోని సిటీ సెంట్రల్‌హాల్‌లో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌.. పద్మశాలీల సంక్షేమాన్ని విస్మరించారని, ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమి అడిగితే పట్టించుకోలేదని విమర్శించారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. పద్మశాలీలు ఆర్థికంగా ఎదిగేందుకు రూ.లక్ష వ్యక్తిగత రుణాల మంజూరు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అలాగే పద్మశాలీ వ్యాపారస్తులకు టూవీలర్‌ మోపెడ్‌ వాహనాలను అందజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు తెలుపుతూ హుజూరాబాద్‌ గౌడ కులస్తులు ఏకగ్రీవ తీర్మానం చేసి గంగులకు అందజేశారు.
చదవండి: కరీంనగర్‌.. అతలాకుతలం
కాంగ్రెస్‌ పార్టీలో మొదలైన సందడి.. ఆ ఎన్నికల కోసం ఏకంగా..

టీపీసీసీ ఓబీసీ సెల్‌ కార్యవర్గం రద్దు 
సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ ఓబీసీ సెల్‌ కార్యవర్గంతో పాటు జిల్లా చైర్మన్‌ పదవులను తాత్కాలికంగా రద్దు చేశారు. ఏఐసీసీ ఓబీసీ విభాగం చైర్మన్‌ తమరద్వజ్‌ సాహు ఆదేశాల మేరకు కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ఓబీసీ సెల్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌గౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని నియమిస్తామని, జిల్లాలకు కొత్త చైర్మన్లను ఎంపిక చేస్తామని, ఆసక్తి కలిగిన నేతలు తమ దరఖాస్తులను గాం«దీభవన్‌లో అందజేయాలని శ్రీకాంత్‌గౌడ్‌ సూచించారు.  

మరిన్ని వార్తలు