టీడీపీకి గంజి చిరంజీవి రాజీనామా

11 Aug, 2022 03:05 IST|Sakshi
కన్నీటి పర్యంతమవుతున్న గంజి చిరంజీవి

టీడీపీలో బీసీలతోపాటు ఏ సామాజికవర్గానికీ గౌరవం లేదు 

నన్ను నియోజకవర్గానికి దూరం చేయడానికి కుట్రలు పన్నారు

2014లో సీటు ఇచ్చి సొంత పార్టీ నేతలే ఓడించారు

2019లో సీటు ఇస్తామని చెప్పి చివరలో లాక్కున్నారు

కన్నీటిపర్యంతమైన మున్సిపల్‌ మాజీ చైర్మన్, టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి

మంగళగిరి: టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సహా ఏ ఒక్క సామాజికవర్గానికి గౌరవం లేదని మంగళగిరి మాజీ మున్సిపల్‌ చైర్మన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి  గంజి చిరంజీవి తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీలో పెత్తనమంతా ఒకే సామాజిక వర్గానిదేనని ఆరోపించారు. తనకు జరిగిన అవమానానికిగానూ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మంగళగిరిలో మీడియాతో ఆయన మాట్లాడారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన తనకు పార్టీలో జరిగిన అవమానంపై కన్నీటి పర్యంతమయ్యారు. 2014లో సీటు ఇచ్చినట్లే ఇచ్చి తనను సొంత పార్టీ నేతలే ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తనను ఓడించిన వారే ఇప్పుడు పార్టీని నడిపిస్తూ దాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నుంచి దూరం చేసేందుకే తనకు పార్టీ రాష్ట్ర పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. మంగళగిరి ప్రజల నుంచి తనను ఎవరూ దూరం చేయలేరన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీలకు గౌరవం లేదన్నారు. అవమానాలకు గురిచేస్తూ బీసీలను ఏమి ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. చేనేత నాయకుడుగా ఉన్న తనను పార్టీ నుంచి దూరం చేసేందుకు మానసికంగా హత్య చేశారన్నారు.

2019లో చివర వరకు తనకే సీటు అని చెప్పి మోసం చేసినా పార్టీ కోసం భరించాననన్నారు. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు, కుట్రలు తట్టుకోలేకే టీడీపీకి రాజీనామా చేస్తున్నానన్నారు. తన ఆవేదన గురించి లోకేష్‌తో పాటు టీడీపీ నాయకులందరికి తెలిసినా పట్టించుకోలేదని వాపోయారు. ఎన్టీఆర్‌ ఆశయాలకు వెన్ను పోటు పొడిచి పార్టీలో బీసీలకు స్థానం లేకుండా చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో బీసీ, ఎస్టీ, ఎస్టీలతోపాటు అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసేవారితో కలిసి నడుస్తానని తెలిపారు.  

మరిన్ని వార్తలు