నెహ్రూ వల్లే కశ్మీర్‌ సమస్య.. పరిష్కరించిన ఘనత మోదీది

14 Oct, 2022 04:43 IST|Sakshi

జంజార్కా/ఉనాయ్‌(గుజరాత్‌): కశ్మీర్‌ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. నెహ్రూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్‌ 370ను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేసినప్పటికీ అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 

త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో ఆయన గురువారం అహ్మదాబాద్‌ జిల్లా జంజర్కా, ఉనాయ్‌లలో బీజేపీ ‘గౌరవ్‌ యాత్ర’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా పైవ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్‌ 370ను రాజ్యాంగంలో చేర్చుతూ నెహ్రూ చేసిన తప్పిదం వల్లే కశ్మీర్‌ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆ ప్రాంతం దేశంతో సరిగ్గా విలీనం కాలేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఆర్టికల్‌ 370ను తొలగించాలని కోరుకున్నారు.

ప్రధాని మోదీ 2019లో ఒక్క వేటుతో 370ను రద్దు చేసి, కశ్మీర్‌ను దేశంతో విలీనం చేశారు’అని అమిత్‌ షా చెప్పారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటూ బీజేపీ చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. కానీ, మందిరం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది’అని అన్నారు. 2016 సర్జికల్‌ స్ట్రైక్స్, 2019 ఎయిర్‌ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ.. సీమాంతర ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు.

గతంలో యూపీఏ హయాంలో పాక్‌ ఆర్మీ మన సైనికుల తలలను నరికి, వెంట తీసుకెళ్లింది. 2014లో మన ప్రభుత్వం వచ్చాక కూడా అలాగే చేయాలని చూసింది. కానీ, ఇది మౌని బాబా (మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఉద్దేశిస్తూ) ప్రభుత్వం కాదన్న విషయం వాళ్లు మరిచారు. ఉగ్రదాడులకు సర్జికల్‌ స్ట్రైక్స్, ఎయిర్‌ స్ట్రైక్స్‌ ద్వారా మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పింది’అని అమిత్‌ షా అన్నారు. ‘గుజరాత్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో ఏడాదిలో 365 రోజులకు గాను 200 రోజులు కర్ఫ్యూయే అమలయ్యేది. కానీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక గత 20 ఏళ్లలో అలాంటి పరిస్థితులు లేవు’అని చెప్పారు. దేశానికి భద్రత కల్పించడం, దేశాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేవని విమర్శించారు.

ఇదీ చదవండి: ఉద్ధవ్ థాక్రే వర్గానికి భారీ ఊరట

>
మరిన్ని వార్తలు