ఫైబర్‌నెట్‌ అక్రమార్కులకు శిక్ష తప్పదు

14 Sep, 2021 04:45 IST|Sakshi

చంద్రబాబు జమానాలో జరిగిన దోపిడీలో కీలక సాక్ష్యాలు లభ్యం 

రూ.121 కోట్ల అక్రమ చెల్లింపులకు ఆధారాలు  

నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్‌కు టెండర్లు 

మీడియాతో ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌ కుంభకోణానికి సంబంధించి సీఐడీ దర్యాప్తులో స్పష్టమైన ఆధారాలు లభించాయని, ఇందులోని సూత్రధారులు శిక్ష నుంచి తప్పించుకోలేరని ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ పి. గౌతమ్‌రెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని టెరాసాఫ్ట్‌ కంపెనీకి రూ.321 కోట్ల విలువైన టెండర్లు అప్పగించడమే కాకుండా రూ.121 కోట్ల పనులకు అక్రమ చెల్లింపులు జరిపారన్న విషయం సీఐడీ ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలోని కొంతమంది పెద్దలు టెరాసాఫ్ట్‌ పేరుతో ఏ విధంగా టెండర్లు దక్కించుకున్నారన్న విషయంపై స్పష్టమైన ఆధారాలు లభించాయన్నారు. 

టెండర్ల ఎంపికలో టెరాసాఫ్ట్‌ ఎండీ.. 
టెరాసాఫ్ట్‌కు ఎండీగా ఉన్న వేమూరి హరికృష్ణప్రసాద్‌ 2015లో టెండర్లు పిలిచే సమయానికి ఆ పదవికి ఆయనతో రాజీనామా చేయించి ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ టెండర్ల పరిశీలన కమిటీలో సభ్యునిగా నియమించారని గౌతమ్‌రెడ్డి  వెల్లడించారు. అలాగే, ఏడాదిపాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఆ సంస్థను కేవలం రెండు నెలల్లోనే నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించారని.. టెండర్ల గడువును ఒక వారం పొడిగించి బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించిన మర్నాడే ఆ కంపెనీతో టెండర్లు వేయించారన్నారు.

టెరాసాఫ్ట్‌కు ఈ రంగంలో అనుభవం లేకపోయినా టెండర్లు కట్టబెట్టినట్లు ఆయన తెలిపారు. ఇలా అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వైనంపై బేస్‌ పవర్‌ సిస్టమ్స్‌ అనే కంపెనీ ఫిర్యాదు చేస్తే దానిపై దర్యాప్తు చేయకుండా, ఏకంగా ప్రభుత్వమే బేస్‌ పవర్‌ సిస్టమ్స్‌పై కేవియట్‌ దాఖలు చేసిందంటే ఈ కుట్ర వెనకున్న వారి హస్తం స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న ప్రతీఒక్కరూ శిక్ష ఎదుర్కొక తప్పదన్నారు. ప్రస్తుతం 19 మంది అనుమానితులపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని, దర్యాప్తు తర్వాత కీలక వ్యక్తుల పాత్ర బయటకు వస్తుందని గౌతమ్‌రెడ్డి చెప్పారు.   

మరిన్ని వార్తలు