సీఎం అయ్యాక ‘ఆరోగ్య’ హామీలు మర్చిపోయారు

26 May, 2022 06:02 IST|Sakshi
మీడియా సమావేశంలో గీతారెడ్డి, జగ్గారెడ్డి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ఇంకో సంవత్సరం అయితే రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని, ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరోగ్య రక్షణ హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ప్రశ్నించింది. జిల్లాకో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తా మని, ప్రతి జిల్లాలో మెడికల్‌ కాలేజీ పెడతా మని ఇచ్చిన హామీలను మర్చిపోయారా? అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు జె.గీతారెడ్డి, టి.జగ్గారెడ్డి ప్రశ్నించారు.

బుధవారం గాంధీభవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక, ఆరోగ్య శాఖలు రెండూ మంత్రి హరీశ్‌రావు దగ్గరే ఉన్నాయని, ప్రతి మండలానికి 100 పడకల ఆసుపత్రులు ఏమయ్యాయని గీతారెడ్డి ప్రశ్నించా రు. ఢిల్లీలో బస్తీ దవాఖానాలు బాగున్నా యని కేసీఆర్‌ అంటున్నారంటే తెలంగాణ లో బాగా లేవనేనా అని ఎద్దేవా చేశారు. అయినా, పన్ను నొప్పికి ఢిల్లీ, ఛాతీ నొప్పికి యశోదకు వెళ్లే కేసీఆర్‌కు బస్తీ దవాఖానాల గురించి ఏం తెలుస్తుందన్నారు.  

ప్రజల ఆరోగ్యం గాలికొదిలి దేశ రాజకీయాలా? 
తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాల్లో బిజీ అయ్యారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయని, సీఎం అయ్యాక ఆయన ఆరోగ్య మేనిఫెస్టోను మర్చిపోయారని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల్లోనే తెలంగాణ ప్రజలు ఆరోగ్య సేవలు పొందుతున్నారని చెప్పారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కనుమరుగైందని పేర్కొన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌కు ప్రజలకిచ్చిన ఆరోగ్య హామీలను మరోమారు గుర్తు చేస్తున్నామని అన్నారు.  

మరిన్ని వార్తలు