బీజేపీ నేతలకు బుర్ర లేదు.. అందుకే ఏది పడితే అది మాట్లాడుతారు: సీఎం నితీశ్ కుమార్

23 Apr, 2023 14:15 IST|Sakshi

పట్నా: బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. ఈ తరం కమలం పార్టీ నాయకులకు అసలు బుర్ర లేదని, ఏం మాట్లాడుతారో కూడా తెలియదని ధ్వజమెత్తారు. తాను వాళ్లలా కాదని, నోటికొచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడనని పేర్కొన్నారు. నితీశ్, ఆయన పార్టీని మట్టిలో కలిపేస్తామని బిహార్ బీజేపీ చీఫ్‌ సామ్రాట్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇలా ఫైర్ అయ్యారు.

శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నితీశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సామ్రాట్. వచ్చే ఎన్నికల్లో నితీశ్‌ను, ఆయన పార్టీని మట్టిలో కలపాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నితీశ్‌ను ప్రధాని మోదీ సీఎం చేసినా.. ఆయన మోసం చేసి ఆర్జేడీతో చేతులు కలిపారని విమర్శించారు. ఇందుకు ప్రతీకారంగా 2024 సార్వత్రిక ఎన్నికలు, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ పార్టీని మట్టిలో కలిపి తగిన బుద్ది చెప్పాలన్నారు.

కొద్ది రోజుల క్రితం యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ మాఫియాను మట్టిలో కలిపేస్తాం అని హెచ్చరించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆ తర్వాత రౌడీ షీటర్లు, గ్యాంగ్‌స్టర్లు వరుస ఎన్‌కౌంటర్లరో హతమైన విషయం తెలిసిందే. యోగి వ్యాఖ్యలనే స్ఫూర్తిగా తీసుకుని బిహార్ బీజేపీ చీఫ్‌.. నితీశ్‌ పార్టీని మట్టిలో కలిపేస్తాం అని వ్యాఖ్యానించారు.
చదవండి: అతీక్ అహ్మద్ లాయర్‌కు మరో షాక్‌! ఉమేశ్‌పాల్ ఫొటోలు షేర్‌ చేశాడని క్రిమినల్ కేసు

మరిన్ని వార్తలు