‘గ్రామానికి రూ.కోటి నిధులు ఇవ్వాలి.. లేకుంటే టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తా’

11 Aug, 2022 11:32 IST|Sakshi

సాక్షి, ఘట్‌కేసర్‌: హామీల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. స్థానిక సంస్థల అభివృద్ధికి మూడేళ్లుగా మంత్రిని నిధులు అడిగితే ఎంపీపీనని చూడకుండా మంత్రి మల్లారెడ్డి వ్యక్తిగతంగా తనను దూషిస్తున్నారని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  

ఆరు నెలల కిందట ఇచ్చిన ప్రొసిడింగ్స్‌ పనులకు దిక్కులేదని.. నిధులు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిధుల కోసం అధికారులకు వినతులు ఇ‍చ్చి , గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టినా నిధులు ఇవ్వడం లేదన్నారు.  

నిధులడిగితే పార్టీ మారుతున్నాడని.. 
నిధులడిగితే పార్టీ మారుతున్నాడని అంటున్నారని.. తనను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మండలోని ప్రతి గ్రామానికి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మండలంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను మండలంలోని పేదలకు మొదట ఇవ్వాలన్నారు. మండలంలోని దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని... గతంలో ఇచ్చిన ప్రొసిడెంగ్స్‌ పనులు చేయించాలని డిమాండ్‌ చేశారు.

కరోనా సమయంలో మండలంలో అందించిన సేవలు ప్రజలకు తెలుసనని ఈ సందర్భంగా ఎంపీపీ అన్నారు. రెండు రోజుల్లో నిధులివ్వని పక్షంలో ఎంపీపీ పదవికి, టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ప్రజల మధ్యకు వెళ్లి వారి అభీష్టం మేరకు నడుచుకుంటానని అన్నారు.  

మరిన్ని వార్తలు