2023లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తాం : బండి సంజయ్‌

4 Dec, 2020 19:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా ఫుంజుకుంది. మొత్తం 150 డివిజన్లకు గానూ 47 స్థానాల్లో విజయం సాధించి గ్రేటర్‌లో సత్తా చాటింది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగే సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మాత్రం 47 సీట్లను కైవసం చేసుకొని మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో సంబరాలు షురూ అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంతత్రి కిషన్‌ రెడ్డితో పాటు డీకే అరుణ, లక్క్ష్మణ్‌లు కలిసి కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చారు. అనంతరం ఒ‍కరినొకరు స్వీట్లు పంచుకొన్న బీజేపీ నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా 2023లో తెలంగాణలో అధికారమే లక్క్ష్యంగా పనిచేస్తామని బండి సంజయ్‌ పేర్కొన్నారు. (చదవండి : గ్రేటర్‌ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే..)

కాగా గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా హంగ్‌ ఏర్పడడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. టీఆర్‌ఎస్‌ 56 స్థానాలు సాధించి గ్రేటర్‌ పరిధిలో అతి పెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 49( రెండు ఆధిక్యం), ఎంఐఎం 43, కాంగ్రెస్‌ 2 స్థానాల్లో గెలుపొందాయి. కాగా 100 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ ఒక్కస్థానం గెలవకపోగా చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతవ్వడం విశేషం. కాగా గ్రేటర్‌లో మేయర్‌ ఎన్నికకు ఎంఐఎం పార్టీ కీలకం కానుంది.

మరిన్ని వార్తలు