కాంగ్రెస్‌కు షాక్; బీజేపీలో చేరిన మాజీ మేయర్‌

18 Nov, 2020 17:46 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: కాంగ్రెస్‌ నేతలకు బీజేపీ వల!

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నికలో సత్తా చాటాలని భావించి చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీకి  ‘గ్రేటర్‌’  ఎన్నికల వేళ భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో తనకు అలాంటి పరిస్థితి ఎదురుకాదని భావిస్తున్నానని, తన పనితనం చూసిన తర్వాతే జీతం ఇవ్వాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక గ్రేటర్‌ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని బండ కార్తీక ఈ సందర్భంగా స్పష్టం చేశారు.  

‘‘కాంగ్రెస్‌ పార్టీ కోసం సర్వం ధారబోశాను. కానీ నాకు ఇవ్వాల్సిన టికెట్‌ను ఆ పార్టీ రెండు సార్లు వేరే వాళ్లకు కేటాయించింది. ఈసారి మేయర్‌ సీటు బీజేపీదే. ఓటమి భయంతోనే మంత్రి కేటీఆర్‌ జిమ్మిక్కులు చేస్తున్నారు. అంతిమంగా బీజేపీనే విజయం వరిస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. ఇక బీజేపీ గ్రేటర్ ఎన్నికల‌ ఇంఛార్జ్ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడమే తమ లక్ష్యం అన్నారు. ‘‘డబుల్ బెడ్రూం ఇళ్ళ ఎక్కడని పేదలు అడుగుతున్నారు. వారికి కేసీఆర్‌ సర్కారు సమాధానం చెప్పాలి. అసలు మీరేం చేశారు’’అంటూ చురకలు అంటించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రేటర్‌ మేయర్‌ పీఠం తమ పార్టీకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.(చదవండి: గ్రేటర్‌‌ ఎన్నికలు: హైకోర్టు కీలక నిర్ణయం)

కాంగ్రెస్ నేతలకు బీజేపీ వల
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ విజయం సాధించే దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న కాషాయ పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీసింది. కాంగ్రెస్‌ పార్టీ నేతలకు వల వేస్తూ మంతనాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా రాత్రి పది గంటల తర్వాత బీజేపీ నాయకులు కాంగ్రెస్ అసంతృప్త నేతల ఇళ్ళకు వెళ్లినట్లు సమాచారం. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఇళ్ళకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ వారితో చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నేతలతో పాటుగా సనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, దేవి ప్రసాద్ నివాసానికి కూడా కాషాయ పార్టీ నేతలు వెళ్లినట్లు వార్తలు వెలువడుతున్నాయి.(చదవండి: నేను ఫైటర్‌ని.. దేనికి భయపడను : కేసీఆర్‌)

మరిన్ని వార్తలు