మీ తోక ఎలా తొక్కాలో తెలుసు: అక్బరుద్దీన్‌

25 Nov, 2020 14:30 IST|Sakshi

నిన్న సర్జికల్‌ స్ట్రైక్స్‌.. నేడు కూల్చివేతలు

అక్బరుద్దీన్‌కు కౌంటర్‌ ఇచ్చిన ఎంపీ బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎంఐఎం, బీజేపీ నేతలు సై అంటే సై అంటూ మాటలు తూటాలు వదులుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..‘అక్రమ కట్టడాలు, పేదల ఇళ్లు కూల్చేస్తామని చెప్తున్నారు కదా. 4,700 ఎకరాల హుస్సేన్‌సాగర్‌ ఈరోజు 700 ఎకరాలు కూడా లేదు. హుస్సేన్‌సాగర్‌పై ఉన్న పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలి. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో మాకు తెలుసు. మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే. మైనారిటీల అభివృద్ధికి వైఎస్సార్‌ కృషి చేశారు’ అని ప్రశంసించారు.(చదవండి: గ్రేటర్‌లో హీట్‌.. ఫైట్‌.. మాటల తూటాలు)

దమ్ముంటే వాటిని కూల్చండి: బండి సంజయ్‌
మరోవైపు అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలకు బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అక్బరుద్దీన్‌కు దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్‌ సమాధులను కూల్చాలంటూ సవాల్‌ విసిరారు. ‘హిందువుల ఆరాధ్య దైవం అయిన పీవీ, ప్రజా నాయకుడు ఎన్టీఆర్‌ సమాధులు కూల్చేస్తారా? దమ్ముంటే కూల్చండి. మీరు కూల్చిన రెండు గంటల్లోనే దారుసలంని బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు. దారుసలాంలో సౌండ్‌ చేస్తే ప్రగతి భవన్‌లో ఎందుకు రీసౌండ్‌ వస్తుంది. టీఆర్‌ఎస్‌ స్క్రిప్ట్‌ని దారుసలాంలో చదువుతున్నారు. భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే నల్ల జెండాలు పట్టుకున‍్న వారిపై సర్జికల్‌ స్ట్రైక్‌ ఎందుకు చేయకూడదు?’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. (అక్బరుద్దీన్‌కు కేటీఆర్‌ కౌంటర్‌)

మరిన్ని వార్తలు