‘రుచి’ చూపిస్తున్న ఎన్నికలు

25 Nov, 2020 08:58 IST|Sakshi

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి పొరుగు జిల్లాల నుంచి నేతల రాక

నగరంలోనే మకాం.. హోటళ్లు, రెస్టారెంట్లకు ఫుల్‌ గిరాకీ

75% పెరిగిన సీటింగ్‌ సామర్థ్యం.. భారీగా బల్క్‌ ఫుడ్‌ ఆర్డర్లు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ దెబ్బతో ఆర్నెళ్లుగా విలవిల్లాడిన రెస్టారెంట్లు, హోటళ్లు ప్రస్తుతం కస్టమర్లతో కళకళ్లాడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎన్నికల పుణ్యమాని రాష్ట్రం నలమూలల నుంచి ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలంతా వచ్చి ఇక్కడే తిష్టవేయడంతో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 80 శాతం హోటళ్లు తెరుచుకోగా, మునుపటిగా భోజనం ఆరంగించేందుకు వస్తున్న కస్టమర్లు 75 శాతానికి చేరుకున్నారు. ఇక కార్యకర్తల కోసం పార్టీలు బల్క్‌గా ఇస్తున్న ఫుడ్‌ ఆర్డర్ల సంఖ్య పెరగ్గా, మరోపక్క హోమ్‌ డెలివరీలు పెరుగుతున్నాయని ఈ–కామర్స్‌ సంస్థలు చెబుతున్నాయి. (జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: రచ్చ రంబోలా)

హోటళ్లకు ఎన్నికల జోష్‌
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ దెబ్బ తగిలింది. పూర్తిగా మూసివేయాల్సి రావడంతో అద్దెలు కట్టలేక, సిబ్బందికి జీతాలివ్వలేక యజమానులు నష్టపోయారు. తిరిగి జూన్‌ రెండో వారంలో వీటిని తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. సామాజిక దూరం పాటించేలా, ‘కోవిడ్‌’ జాగ్రత్తలు పాటిస్తూ రెస్టారెంట్లలో మార్పుచేర్పులు చేసినా కరోనా కేసుల నేపథ్యంలో వినియోగదారులు పెద్దగా అటు వెళ్లలేదు. దీనికి తోడు చాలా రెస్టారెంట్లలో నిష్ణాతులైన వంటగాళ్లు సొంతూళ్లకు వెళ్లిపోయారు. వారిని తిరిగి రప్పించడం యజమానులకు కష్టమైంది. కొన్ని రెస్టారెంట్లను లాభాలను పక్కనపెట్టి నడిపించినా, వినియోగదారులు రాక, అద్దెలు కట్టలేక వాటిని మూసుకున్నారు. 

ప్రస్తుతం హైదరాబాద్‌ పరిధిలో కరోనా కేసులు తగ్గడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ‘ఆగస్టు వరకు 79 శాతం రెస్టారెంట్లు మూతబడ్డాయి. అనంతరం 21 శాతం మేరకు తెరుచుకున్నా, అవి హోమ్‌ డెలివరీలకే ప్రాధాన్యమిచ్చాయి. ఇందులోనూ 17% తక్కువ సామర్థ్యంతో నడిచాయి. అక్టోబర్, నవంబర్‌లలో పరిస్థితి మెరుగైంది. మూతపడిన రెస్టారెంట్లలోని 52% తిరిగి తెరుచుకున్నాయి’ అని ఇటీవలి సర్వేలు వెల్లడించాయి. తాజాగా గ్రేటర్‌ ఎన్నికలు రావడంతో తెరుచుకున్న హోటళ్లకు కస్టమర్ల రాక రెట్టింపైంది.

పెరిగిన బిర్యానీ ఆర్డర్లు
నగరంలోని 150 డివిజన్లలో ప్రచారం చేసేందుకు హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల నుంచి అన్ని ప్రధాన పార్టీల నేతలు వచ్చి ఇక్కడే మకాం వేశారు. పొరుగు జిల్లాల నుంచి ఆయా పార్టీలకు చెందిన కనీసం 5 వేల మంది చోటామోటా నాయకులు మందిమార్బలంతో హోటళ్లలో దిగారు. వీరందరికీ ఆయా పార్టీలు డివిజన్ల వారీగా హోటళ్లలో వసతి కల్పించడంతో అవన్నీ కళకళ్లాడుతున్నాయి. గ్రేటర్‌ ఎన్నికలతో కస్టమర్ల తాకిడి పెరిగిందని, సీటింగ్‌ సామర్థ్యం సైతం 50 నుంచి 75 శాతానికి పెరిగిందని గచ్చిబౌలిలోని హోటల్‌ యజమాని ఒకరు తెలిపారు. వారం రోజులుగా బల్క్‌గా రోజుకు రెండు నుంచి మూడు ఆర్డర్లు ఉంటున్నాయని కూకట్‌పల్లికి చెందిన మరో రెస్టారెంట్‌ యజమాని తెలిపారు. (‘మూసీ’ చుట్టూ అందరి ప్రదక్షిణం)

ఇక ఆగస్టు, సెప్టెంబర్‌లలో వివిధ వెరైటీల వంటకాల మెనూని కుదించి, డిమాండ్‌ ఉన్న వాటినే కస్టమర్లకు అందించగా, ప్రస్తుతం డిమాండ్‌ పెరగడంతో అన్ని వెరైటీలను అందిస్టున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక గత 15 రోజులుగా గ్రేటర్‌ పరిధిలో హోమ్‌ డెలివరీలు పెరిగాయని జొమాటో తన సర్వేలో వెల్లడించింది. ముఖ్యంగా చికెన్, మటన్‌ బిర్యానీ ఆర్డర్లు పెరిగాయని, ఒకే ఆర్డర్‌పై ఎక్కువ మందికి సరిపోయే భోజనం ఆర్డర్లు ఇస్తున్న వారి సంఖ్య సైతం పెరిగిందని డెలివరీ బాయ్‌లు చెబుతున్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు