నేడు కేసీఆర్‌ ‘గ్రేటర్‌’ సభ

28 Nov, 2020 01:16 IST|Sakshi
కేసీఆర్‌ (పాత చిత్రం)

విపక్షాల విమర్శలకు బదులివ్వనున్న గులాబీ బాస్‌

నగర అభివృద్ధికి చేసిన కృషిని వివరించే అవకాశం

కోవిడ్‌ నిబంధనల మేరకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకోవడంతో నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియం వేదికగా శనివారం భారీ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ఎజెండాను ప్రజ ల్లోకి బలంగా తీసుకెళ్లడంతోపాటు విపక్షాల విమర్శలకు సభా వేదికగా దీటుగా సమాధానం ఇవ్వనున్నట్లు తెలిసిం ది. ఈ నెల 23న పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా రాజకీయ అంశాలు, విపక్షాల విమర్శల జోలికి పెద్దగా వెళ్లని కేసీఆర్‌.. ఆదివారంతో గ్రేటర్‌ ఎన్నికల ప్రచా రం ముగియనుండటంతో ఆరేళ్ల తమ పాలనలో హైదరాబాద్‌ అభివృద్ధికి చేసిన కృషిని వివరిస్తారని భావిస్తున్నారు.

ప్రధాని పర్యటనపై ఆచితూచి స్పందిద్దాం..
గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ పక్షాన పరోక్ష ప్రచారం కోసమే కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ పురోగతి పేరిట ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఒకవేళ ఏవైనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తే అప్పుడు ఆచితూచి స్పందించాలని ఆ పార్టీ భావిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ తదితరుల వరుస పర్యటనల నేపథ్యంలో వారు చేస్తున్న విమర్శలు, ఓటర్ల స్పందన తదితరాలకు సంబంధించిన వివరాలను టీఆర్‌ఎస్‌ క్రోడీకరిస్తోంది. శనివారం జరిగే సభలో కేసీఆర్‌ వాటన్నంటికీ సమాధానం ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

జన సమీకరణపై ప్రత్యేక దృష్టి...
బహిరంగ సభకు భారీగా జనసమీకరణపై టీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. 150 డివిజన్ల నుంచి సుమారు 30 వేల నుంచి 40 వేల మందిని సభకు తరలించాలని భావిస్తున్నారు. నగరం నలుమూలల నుంచి బైక్‌ ర్యాలీలతో సభాస్థలికి చేరుకోవాలని పార్టీ డివిజన్‌ ఇన్‌చార్జీలను అధినాయకత్వం ఆదేశించింది. కోవిడ్‌ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని సభకు హాజరయ్యే వారు మాస్క్‌లతో రావాలని, లేని వారికి స్టేడియం ప్రధాన ద్వారం వద్ద మాస్క్‌లను పంపిణీ చేస్తామని ఆ పార్టీ చెబుతోంది. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నానికి సభా వేదిక, స్టేడియం పరిసరాలను శానిటైజ్‌ చేయనున్నారు. కాగా, సభ ఏర్పాట్లను పూర్తిచేసినట్లు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు.

నగరంలో నేడు..
సీఎం కేసీఆర్‌
వేదిక: ఎల్బీ స్టేడియం (ఎన్నికల బహిరంగ సభ)
సమయం: సాయంత్రం 4 గంటలకు ప్రారంభం

ప్రధాని మోదీ
వేదిక: భారత్‌ బయోటెక్, జినోమ్‌ వ్యాలీ, శామీర్‌పేట     
సమయం: మధ్యాహ్నం 1.30 నుంచి ప్రారంభం

మరిన్ని వార్తలు