డిసెంబర్‌ నుంచి నీటి బిల్లులు రద్దు: కేసీఆర్‌

23 Nov, 2020 14:53 IST|Sakshi

కరోనా కాలంలో మోటారు వాహన పన్ను రద్దు

నలువైపులా మరో 3 టిమ్స్‌ ఆస్పత్రులు

అండర్‌ గ్రౌండ్‌లో హై టెన్షన్‌ కేబుళ్లు

సీనియర్‌ సిటిజన్లకు ఫ్రీ బస్‌ పాస్‌లు

వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్‌

ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్

హైదరాబాద్‌లో మరో 5 లక్షల సీసీ కెమెరాలు

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సోమవరం ప్రగతి భవన్‌లో విడుదల చేశారు. 10 లక్షల మంది నల్లా వినియోగదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. 20 వేల లీటర్ల లోపు నీటి వినియోగదారులు డిసెంబరు నుంచి నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మంచినీటి కొరత సమస్యను పరిష్కరించామన్నారు కేసీఆర్‌. పెట్టుబడుల విషయంలో హైదరాబాద్‌ దేశంలో నంబర్.2గా ఉందని తెలిపారు. కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘సెలూన్లకు, లాండ్రీలకు, దోబీఘాట్‌లకు ఉచిత విద్యుత్‌ ఇస్తాం. కరోనా కాలానికి సంబంధించి మోటారు వాహన పన్ను రద్దు చేస్తాం. సినిమా థియేటర్లకు విద్యుత్‌ కనీస డిమాండ్‌ ఛార్జీలు రద్దు చేస్తాం. 10 కోట్ల రూపాయల లోపు బడ్జెట్‌ సినిమాలకు ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్‌తో సాయం చేస్తాం. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అధిక షోలు ప్రదర్శించేందుకు అనుమతిస్తాం. కొన్ని రాష్ట్రాల మాదిరి టికెట్‌ ధరలను సవరించుకునే వెసులుబాటు కల్పిస్తాం. తాగునీరు కోసం కేశవాపురంలో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టాము’ అని తెలిపారు. (6 ఏళ్లు.. 60 తప్పులు)

సీనియర్‌ సిటిజన్లకు ఫ్రీ బస్‌ పాస్‌లు
హైదరాబాద్‌ మెట్రోను మరింత విస్తరిస్తామన్నారు సీఎం కేసీఆర్‌. రాయదుర్గం-ఎయిర్‌పోర్ట్‌, బీహెచ్‌ఈఎల్‌-మెహిదీపట్నం వరకు మెట్రోని విస్తరిస్తామన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వేగంగా వెళ్లేందుకు త్వరలో ఎక్స్‌ప్రెస్‌ మెట్రోరైలు ప్రారంభిస్తామన్నారు. మరో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్‌ విస్తరణ చేపడతామన్నారు. ప్రజారోగ్యానికి ప్రత్యేక దావాఖానాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరం నలువైపులా మరో 3 టిమ్స్‌ ఆస్పత్రులు నిర్మిస్తామన్నారు. అలానే ఉన్నచోటే అన్ని వసతులు సమకూరేలా "మైక్రోసిటీ" కాన్సెప్ట్‌ అమలు చేస్తామన్నారు. హైటెన్షన్‌ విద్యుత్‌ కేబుళ్లు అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బస్తీల్లో ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లు (ఇంగ్లీష్‌), విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం ఈ-లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. సీనియర్‌ సిటిజన్ల కోసం ప్రతి డివిజన్‌లో లైబ్రరీ, క్లబ్‌, యోగా, జిమ్‌ సెంటర్లు ఏర్పాటు చేయడమే కాక వారికి ఉచితంగా బస్‌ పాసులు ఇస్తామన్నారు. త్వరలో కొత్త జీహెచ్‌ఎంసీ చట్టం తీసుకొస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు

వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్‌
‘గత నెలల వచ్చిన భారీ వరదల వల్ల నగరం అతలాకుతలమయ్యింది. భవిష్యత్తులో వరదనీటి నిర్వహణకు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించనున్నాము. ప్రణాళిక అమలు కోసం 12వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం. హైదరాబాద్‌ మహానగరానికి సమగ్ర సీవరేజి మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తాం. మురుగు శుద్ధి, డ్రైనేజీ పనులకు 13వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేస్తాం. గోదావరితో మూసీ నదీని అనుసంధానం చేస్తాం. బాపుఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు నది మధ్యలో బోటింగ్‌.. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లకు గోదావరి నుంచి నీళ్లు తరలిస్తాం’ అన్నారు కేసీఆర్‌. అలానే 250 కోట్ల రూపాయలతో జీహెచ్‌ఎంసీలో 20 చెరువుల సుందరీకరణ పనులు.. హెచ్‌ఎండీఏలో 120 కోట్ల రూపాయలతో 20 చెరువుల సుందరీకరణ పనులు ప్రారంభిమస్తామని తెలిపారు.

ట్రాఫిక్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌
విశ్వనగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తీర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేసీఆర్‌. ఇందుకు గాను త్వరలో ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్‌ మ్యాగ్నెట్‌గా హైదరాబాద్‌ మారిందన్నారు. ఏరోస్పేస్‌, లాజిస్టిక్స్‌, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రికల్‌, రియల్‌ రంగాలు మరింత విస్తరిస్తామన్నారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో మరో 5 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ జాగాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్దీకరణ చేస్తామని..  స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం 5లక్షల రూపాయల వరకు సాయం చేస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్లు పెంచుతామన్నారు. నగరానికి వచ్చే వారి కోసం షెల్టర్‌ హోమ్స్‌ విస్తరిస్తామన్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు కేసీఆర్‌ తీపికబురు చెప్పారు. హెచ్‌డీ, ఎల్‌టీ కేటగిరిలకు కనీస డిమాండ్‌ ఛార్జీలు మినహాయింపు ఇస్తామన్నారు.

మేనిఫెస్టో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు