హైదరాబాదీలకు కేసీఆర్‌ మరిన్ని వరాలు..

28 Nov, 2020 18:18 IST|Sakshi

డిసెంబర్ 7 నుంచి అర్హులైనవారందరికీ రూ.10వేల వరదసాయం

1350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే.. 13 పైసలు కూడా ఇవ్వలేదు

వరదల నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తి కలిగిస్తాం

బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: 20 వేల లీటర్ల వరకు నల్లా బిల్లులు రద్దు చేశాం.. ఢిల్లీ తర్వాత దేశంలో తెలంగాణలో మాత్రమే నల్లా బిల్లులు రద్దు.. దీన్ని అపార్ట్‌మెంట్లకూ వర్తింపజేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌ చాలా చైతన్యవంతమైన నగరమని, ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌ కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలని.. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. (చదవండి: బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?)

అదే నా లక్ష్యం..
‘‘అపోహలు, అనుమానాలపై సుదీర్ఘపోరాటం ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. కరెంట్‌ ఉండదు, నీళ్లు రావు, పరిశ్రమలు వెళ్లిపోతాయన్నారు. హైదరాబాద్‌ ఖాళీ అవుతుందని శాపాలు పెట్టారు. అందరి అంచనాలను తలక్రిందలు చేసి అభివృద్ధి సాధించాం. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి బిడ్డా.. మా బిడ్డే. ఎక్కడా కుల, మత, ప్రాంతీయ వివక్షలు లేకుండా ముందుకెళ్లాం. కరెంట్‌ సమస్యను పరిష్కరించాం. 24 గంటలూ కరెంట్‌ ఇస్తున్నాం. ఏరోజు మేం పక్షపాత నిర్ణయాలు చేయలేదు. అంచనాలను మించి మిషన్‌ భగీరథను విజయవంతం చేశాం. రాష్ట్ర ప్రజలకు 24 గంటలూ మంచినీరు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ఢిల్లీ, నాగపూర్‌లలో ఇప్పటికే అధ్యయనం చేశాం. కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు, కేసీఆర్‌ కిట్‌ పథకాలు ఎక్కడా లేవని’’  ఆయన పేర్కొన్నారు. (చదవండి: ‘ఇంట్లో చెప్పే వచ్చా.. చావుకు భయపడేది లేదు’)

కేసీఆర్‌ కిట్టు... సూపర్‌ హిట్టు..
కేసీఆర్‌ కిట్టు... సూపర్‌ హిట్టు అని కేసీఆర్‌ అన్నారు. ప్రతి రైతుకు రైతు బీమా పథకాన్ని అందించాం. 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని, సెలూన్లకు ఉచిత విద్యుత్‌ అందించామని, దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించామని తెలిపారు. కరోనాతో 52 వేల కోట్ల ఆదాయం కోల్పోయినా సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. మరోసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వరదల నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తిని కలిగిస్తామని పేర్కొన్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను తెస్తున్నామని, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో సేవలను పొడిగిస్తామని చెప్పారు. గోదావరితో మూసీనదిని అనుసంధానం చేసి ప్రక్షాళన చేస్తామని, హైదరాబాద్‌కు అందమైన మూసీని అందించే బాధ్యత నాదని ఆయన పేర్కొన్నారు.

నా కళ్లలో నీళ్లొచ్చాయి..
‘‘గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాం. ముష్కరులు, రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాం. తలకుమాసినవాడి మాటలను పట్టించుకోను. హైదరాబాద్‌ నగరం, రాష్ట్రం అభివృద్ధే నా లక్ష్యం. ముంబైని 10 రోజులకుపైగా వరద ముంచెత్తింది. చెన్నైని 21 రోజులకుపైగా వరద ముంచెత్తింది. ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు కూడా వరద ముప్పు తప్పలేదు. హైదరాబాద్‌ నగరానికి వరద కష్టం వస్తే మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజల దగ్గరకే వెళ్లి సహాయక చర్యలు అందించారు. ఆ దృశ్యాలను చూసి నా కళ్లలో నీళ్లొచ్చాయి. ఇంటికి రూ.10వేల సహాయం అందించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నా. బీజేపీ, కాంగ్రెస్‌లు పరిపాలించే ఏ నగరంలోనూ ఆర్థికసాయం అందించలేదు. అయినా కిరికిరి పెడుతున్నారు.. బాధతో ఈ మాట అంటున్నా. డిసెంబర్ 7 నుంచి అర్హులైనవారందరికీ రూ.10 వేల వరదసాయం అందిస్తామని’’  కేసీఆర్‌ తెలిపారు.

బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?
1350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే.. 13పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. మేం భారతీయులం కాదా?.. భారతదేశంలో లేమా? అని ప్రశ్నించారు. పక్కనే ఉన్న కేరళ, కర్ణాటకకు ఇచ్చారని ఆయన విమర్శించారు. వరద సాయం చేయకుండా కేంద్రమంత్రులు ఇప్పుడు వరదలా వస్తున్నారు. ఇవి స్థానిక ఎన్నికలా? జాతీయస్థాయి ఎన్నికలా? బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా? అంటూ సీఎం కేసీఆర్‌ దుయ్యబట్టారు.

గజగజ వణుకుతున్నారు..
‘‘ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి కూడా వస్తున్నారు. కేసీఆర్‌ ఢిల్లీకి వస్తున్నాడని గజగజా వణుకుతున్నారు. ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలను ఎందుకు అమ్ముతున్నారు?. యూపీ సీఎం ఇక్కడి వచ్చి ప్రచారం చేస్తున్నారు. 28 ర్యాంకులో ఉన్నాయన మనకేం చెబుతాడు. హైదరాబాద్‌కు వెల్లువలా పరిశ్రమలు వస్తున్నాయి. బిపాస్‌ కావాలా?, కర్ఫ్యూ పాస్‌ కావాలో? బిల్డర్లు ఆలోచించుకోవాలి. హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి. ప్రగతిశీల ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలిపించి టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని’’  సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు