కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

24 Nov, 2020 21:21 IST|Sakshi

వరద బాధితులకు 50వేలు..

ఆరోగ్యశ్రీ పథకంలో కోవిడ్-19 చికిత్స

ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్, ధరణి రద్దు

30, 000 లీటర్లు ఉచితంగా మంచినీటి సరఫరా

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరద బాధిత ప్రతి కుటుంబానికి రూ.50వేలు, పూర్తిగా దెబ్బతిన్న పూర్తిగా దెబ్బతిన్న గృహలకు రూ. 5లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ.2.5లక్షల చొప్పున సహాయం చేస్తామని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాసోజు శ్రవణ్  కాంగ్రెస్ మేనిఫెస్టోను వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో చనిపోయిన ప్రతివ్యక్తి కుటుంబానికి రూ. 25లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు.(చదవండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. టీఆర్‌ఎస్‌ వరాల జల్లు)

ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ... ఎన్‌డిఎంఎ మార్గదర్శకాలను అమలు చేస్తామని, హైదరాబాద్‌కు విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని, డాప్లర్ వెదర్ రాడార్ టెక్నాలజీ సాహయంతో వర్షాన్ని, అదే విధంగా వర్షపాతాన్ని ముందే అంచనావేసి ప్రజలని అప్రమత్తం చేసి ధన, ప్రాణ నష్టాలని నివారించేదుకు తగు సదుపాయాలు, వనరులు సమకూరుస్తామని హామీలో పేర్కొన్నారు. ఆర్‌డబ్ల్యూఏలతో పాటు చెరువులు సంరక్షణ అథారిటీని ఏర్పాటు చేసి అవి కబ్జాలకు గురికాకుండా, అన్యాక్రాంతం కాకుండా చేస్తామని, నాలాల పూడిక పనుల్ని ఎప్పటికప్పుడు చేపట్టి, రిటైనింగ్వాల్స్ , ఫెన్సింగ్ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. జపాన్, హాంకాంగ్ దేశాలలో ఏ విధంగానైతే విజయవంతంగా వరద నీటిని నిలువ చేసిందుకు, క్రమబద్ధీకరించేందుకు అతిపెద్ద అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ సదుపాయాలను అనుసరించి ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజి ట్యాంకులను ఏర్పాటు చేసి వరద నీటిని నిరోధించడం, క్రమబద్దీకరించేలా చూస్తామని వరద రహిత హైదరాబాద్ ని నిర్మిస్తామని తెలిపారు.

అందరికీ అందుబాటులో వైద్య సేవలు:
కోవిడ్-19 చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తాం. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్‌ ఇతర ఆసుపత్రులని ప్రత్యేకంగా మెరుగుపరుస్తామని, అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచిత ఔషదాలు అందజేస్తామని, ప్రతి 100 దవాఖానాలకు ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని శ్రవణ్ వెల్లడించారు 

ఉచిత రవాణా సదుపాయం:
మహిళలకు, విద్యార్ధులకు, దివ్యాగులకు, వృద్దులకు ఆర్టీసి బస్సులు, మెట్రో, ఎంఎంటిఎస్ లలో నగరంలో ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తాం. ఆర్టీసి బస్సుల సంఖ్యను పెంచుతాం, జీహెచ్ఎంసీ పరిధిలోని చివరి కిలోమీటర్ వరకు ఆర్టీసి బస్సుల సేవలు విస్తరిస్తాం.

విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి
కార్పోరేట్, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల యాజమాన్యాలు విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రిస్తాం. అన్ని ప్రభుత్వ బడుల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాం. 150 డివిజన్లు అన్నింటిలో విద్యార్థులకు రీడింగ్ రూమ్‌లు, ఈ-లైబ్రరీలు, ఉచిత ఇంటర్నెట్ సదుపాయాలు కలిస్తామని వివరించారు.

అర్హత గల వారికి గృహాలు:
అర్హత కలిగిన ఇళ్లులేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తాం. ఇంటి జాగా వున్న కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి ఎనిమిది లక్షల రూపాయిలు, సింగెల్ బెడ్ రూమ్ ఇల్లు అదనపు గది నిర్మాణానికి రూ. నాలుగు లక్షల అందిస్తాం.

ఆస్తి పన్నులో రాయితీ:
ఆస్తి పన్ను హేతుబద్దీకరణ. స్వల్ప, మధ్య ఆదాయ వర్గాలకు మేలు చేసేందుకు రూ. 50,000 వరకు ఆస్తి పన్నులో రాయితీ ఇస్తాం. గ్రేటర్ పరిధిలో 100యూనిట్లులోపు విద్యుత్‌ను ఉపయోగించుకునే గృహ వినియోగదారులకు విద్యుత్ రాయితీ ఇస్తాం. లాక్ డౌన్ కాలంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో వున్నవారికి ఆస్తి పన్ను, మోటారు వాహన పన్ను కరెంట్ బిల్లు రద్దు చేయడం చేస్తామని, ఒకవేళ ఇప్పటికే చెల్లింది వుంటే ఆ మొత్తాన్ని తదుపరి బిల్లుకు సర్దుబాటు చేస్తామని హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు. క్షురకులు, రజకులు, వడ్రంగులు, విశ్వకర్మలకు చెందిన దుకాణాలకు ఆస్తి పన్నుతో పాటు విద్యుత్ బిల్లుల్ని మాఫీ చేస్తామని, ఈ వర్గాల వారికి  జీహెచ్ఏంసి పరంగా అవసరమైన అన్ని అనుమతులు ఉచితంగా ఇస్తాం.

ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, ధరణి రద్దు:
ఎటువంటి రుసుము వసూలు చేయకుండానే ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ అమలునకు కృషి చేస్తాం. ధరణి పోర్టల్ రద్దుకు కృషి చేస్తాం

ఉచితంగా మంచినీటి సరఫరా:
30,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా, ఉచితంగా వాటర్ కనెక్షన్ ఇస్తామని వెల్లడించారు.

ఇతర ముఖ్య హామీలు:
మురికివాడల అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేస్తాం. సఫాయి కర్మచారీలు, వారి కుటుంబాలకు రూ.20 లక్షల బీమా సదుపాయం కల్పిస్తాం. కేబుల్‌ టీవీ ఆపరేటర్లకు స్తంభాల ఫీజు మాఫీ చేస్తాం. కొవిడ్‌ వల్ల దెబ్బతిన్న రంగాలకు నిరుద్యోగ అలవెన్స్‌లు ఇస్తాం. అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్య పెంచుతాం. సింగిల్‌ స్క్రీన్‌ సినిమా హాళ్లకు పన్ను మినహాయింపు ఇస్తాం. మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టికెట్ల ధరల నియంత్రణలోకి తెస్తాం. వీధి వ్యాపారులకు ఆరోగ్య, ప్రమాద బీమాకి హామీ ఇస్తున్నట్లు దాసోజు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు రక్షణ అథారిటీ ఏర్పాటు చేసి కబ్జాదారుల చెర నుండి చెరువులని పరిరక్షిస్తాం. నాలా ఆక్రమణలను తొలగించడానికి కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫారసులని అమలు చేస్తాం. హెచ్‌డీఏ పరిధిలోని డ్రైనేజీని 500 కిలోమీటర్లకు పెంచుతాం.

జీవో 68ని రద్దు చేసి హోర్డింగ్‌లపై అధికార పార్టీ గుత్తాధిపత్యాన్ని తొలగించి వాటిపై ఆధారపడిన కుటుంబాల వారిని రక్షిస్తాం. 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తి అమలు జరిగేందుకు జీహెచ్ఎంసీ మేయర్, కార్పోటర్లందరినీ అన్ని విధాలుగా సాధికారుల్ని చేస్తామని, జీహెచ్ఎంసీలో అవినీతి పారద్రోలి, జవాబుదారీతనాన్ని పెంచడానికి లోక్‌పాల్‌ వ్యవస్థను అమలు చేస్తాం. జీహెచ్ఎంసీ మేయర్, కార్పోరేటర్లు, అధికారులును ఈ వ్యవస్థలోకి తెస్తామని వివరించారు.

మరిన్ని వార్తలు