ఎగ్జిట్‌ పోల్స్‌: పుంజుకున్న బీజేపీ

3 Dec, 2020 19:05 IST|Sakshi

మల్కాజ్‌గిరిలో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్‌

తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ

51 స్థానాల్లో 42 చోట్ల మజ్లిస్‌ గెలుపు

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చేశాయి. ఓల్డ్‌ మలక్‌పేట్‌ రీపోలింగ్‌ ఉండటంతో ఎగ్జిట్‌ పోల్స్‌‌ ఫలితాలు ఆలస్యమయిన సంగతి తెలిసిందే. ఇక గురువారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల ప్రకారం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి సొంతంగా మేయర్‌ పీఠం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే దుబ్బాక విజయంతో బల్దియా ఎన్నికల్లో బీజేపీ జోరుగా ప్రచారం చేసింది. ఢీ అంటే ఢీ అన్నట్లు అధికార పార్టీపై విమర్శలు చేసింది. ఇక అమిత్‌ షా సహా పలువురు బీజేపీ ప్రముఖులతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయించింది. ఈ అంశాలన్ని బీజేపికి అనుకూలించాయి. ఇక ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల మేరకు టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య ఆరు శాతం ఓట్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. నగరంలో బీజేపీ సైలెంట్‌ వేవ్‌ కొనసాగిందని చెప్పవచ్చు. ఇక చాలా డివిజన్లలో త్రిముఖ పోరు కొనసాగింది. ఫలితంగా ఓట్లు చీలడంతో టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చింది. ఇక బీజేపీకి ఓటు బ్యాంకు భారీగా పెరిగినట్లు అర్థమవుతోంది. ఇది టీఆర్‌ఎస్‌కు ఆందోళన కలిగించే అంశంగా భావిస్తున్నారు విశ్లేషకులు.

ఇక రేవంత్‌ రెడ్డి ఎంపీగా గెలిచిన మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో హస్తం పార్టీ హవా కొనసాగింది. ఇక్కడ టీఆర్‌ఎస్‌, బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్‌.. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో తేలిపోయింది. ఇక పాతబస్తీలో ఊహించనట్లుగానే మజ్లిస్‌ స్ట్రాంగ్‌గా నిలిచింది. ఇక ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం మజ్లిస్‌ మొత్తం తాను పోటీ చేసిన 51 స్థానాల్లో 42 చోట్ల గెలిచే చాన్స్‌ ఉంది. ఇక తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని బల్దియా ఎన్నికలు మరోసారి నిరూపించాయి. నామమాత్రపు ఓట్లతో సైకిల్‌ మూలకు పడింది. (చదవండి: గ్రేటర్‌ ఎన్నికల్లో సెంచరీ కొడతాం..)

ఇక సిట్టింగ్‌ కార్పొరేటర్లపై ప్రజల్లో భారీగా ఆగ్రహం ఉన్నట్లు ఓట్ల శాతాన్ని బట్టి అర్థమవుతోంది. అధికార పార్టీపై ఆగ్రహాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోవడంలో బాగానే సక్సెస్‌ అయ్యిందని చెప్పవచ్చు. దాంతో బీజేపీ బల్దియాలో భారీగా ఓటు శాతాన్ని పెంచుకుంది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు గ్రేటర్‌ ఎన్నికలు రుజువు చేశాయి. ఇక టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం బీజేపీ అనే భావన ప్రజల్లో బలంగానే నాటుకుపోనుంది. ఇక బీజేపీ ఇదే జోష్‌ కొనసాగిస్తే.. తెలంగాణలో పార్టీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు