రసవత్తరంగా మారిన గ్రేటర్‌ ఫైట్‌

28 Nov, 2020 08:50 IST|Sakshi

హోరాహోరీగా టీఆర్‌ఎస్‌.. బీజేపీ ప్రచారం 

ఢిల్లీ నుంచి క్యూ కట్టిన కమలనాథులు 

నేడు యూపీ సీఎం యోగి.. రేపు అమిత్‌షా రాక

నేడు సీఎం కేసీఆర్‌ సభ

బల్దియా ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అటు టీఆర్‌ఎస్‌...ఇటు బీజేపీ గెలుపే లక్ష్యంగా ఫైనల్‌ పంచ్‌లకు సిద్ధమయ్యాయి. శనివారం సీఎం కేసీఆర్‌తో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. యూపీ సీఎం యోగి, అమిత్‌షా తదితర జాతీయ నేతలతో ప్రచారం చేపట్టేందుకు బీజీపీ సిద్ధమైంది. ఇరు పార్టీల అగ్రనేతలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తూటాల్లాంటి మాటలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. రోడ్‌ షోలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రేటర్‌ రాజకీయం హై హీట్‌కు చేరింది. కేంద్ర, రాష్ట్ర అధికార పక్షాలు ఒక కార్పొరేషన్‌ ఎన్నికకు ఇంత ప్రాధాన్యతనివ్వడం, నేషనల్, స్టేట్‌ లీడర్లు సిటీలోని వీధుల్లోకి తరలిరావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

దుబ్బాకలో పరాజయం.. బీజేపీ దూకుడు నేపథ్యంలో బల్దియా ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మేయర్‌ పీఠం తిరిగి నిలబెట్టుకోవాలనే పట్టుదలతో అధికార టీఆర్‌ఎస్‌లోని పలువురు కీలక నేతలు సిటీలో తిష్ట వేశారు. ముఖ్యనేత కేటీఆర్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్, జెడ్పీ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు ఇక్కడే మోహరించారు. గతం వారం రోజుల నుంచి డివిజన్లలో మకాం వేసి అభ్యర్థుల గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పారీ్టకి పట్టు లేని పాతబస్తీని కూడా వదలకుండా డివిజన్‌కు ఒకరు చొప్పున బాధ్యతలు అప్పగించారు. కొన్ని కీలక డివిజన్లకు ఇద్దరు ముగ్గురు కూడా ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ బల్దియా ఎన్నికల్లో మరో విజయమే లక్ష్యంగా రోడ్‌ షోలు, సభలు, సమావేశాలు, సదస్సులతో హోరెత్తిస్తున్నారు. (హోరెత్తుతున్న హైదరాబాద్‌)

ఫైనల్‌ పంచ్‌
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి,  మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్‌లు ఆయా డివిజన్లలో తిష్టవేసి వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. డివిజన్లలోని కాలనీ, అపార్ట్‌మెంట్‌ కమిటీలు, కుల సంఘాలతో సమావేశమవుతూ అభ్యర్థుల విజయానికి బాటలు సుగమం చేస్తున్నారు. శనివారం జరిగే సీఎం కేసీఆర్‌ సభ ప్రతిష్టాత్మకంగా మారింది. 150 డివిజన్‌ల నుంచి వేలాది  మందిని సభకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు సీఎం సభ ద్వారా టీఆర్‌ఎస్‌ దూకుడు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. (హై పిచ్‌లో బ్యాలెట్‌ బీట్‌)

 
కాషాయం ఫోకస్‌... 
రాష్ట్రంలో ఎలాగైనా టీర్‌ఎస్‌కు చెక్‌ పెట్టాలనే పట్టుదలతో బీజేపీ గ్రేటర్‌ హైదరాబాద్‌పై పూర్తిగా ఫోకస్‌ పెట్టింది. పార్టీ అతిరథ మహారథులందరినీ రప్పించి గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. గతేడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో  నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం కమలనాథులకు ఊపిరి పోయగా, తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక విజయం మరింత జోష్‌ను నింపింది. ఈసారి ఎలాగైనా బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకనుగుణంగా తమ వ్యూహాలకు కూడా పదునుపెట్టింది. ప్రచారంపై  దృష్టి పెడుతూ మరోవైపు ప్రధాన పారీ్టలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోని అసంతప్తి నేతలకు గాలం వేసి లాగేస్తోంది. 

  • పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి, జాతీయ నేత భూపేందర్‌ యాదవ్‌ సిటీలోనే తిష్టవేసి పావులు కదుపుతున్నారు. పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రి డీకే ఆరుణ తదితర కీలక నేతలు అభ్యర్థుల గెలుపును తమ భుజస్కందాలపై వేసుకొని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. 
  • ఇప్పటికే  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ప్రకాశ్‌జవదేకర్,  మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు సూర్యతేజ తదితరులు హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించారు.  
  • మరో కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్‌జీ రెండు రోజులు ప్రచారం చేపట్టారు. 
  • కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఎన్నికల ప్రచారం కోసం శుక్రవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. సాయంత్రం కొత్తపేట చౌరస్తా నుంచి నాగోల్‌ వరకు రోడ్‌ షో నిర్వహించారు. అనంతరం నగర విద్యావంతులతో సమావేశమయ్యారు. 
  • ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. నగరంలోని రోడ్‌ షో నిర్వహించి సాయంత్రం జరిగే బహిరం సభల్లో ఆయన ప్రసంగిస్తారు. 
  • కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యాటన ఖరారైంది. ఆదివారం హైదరాబాద్‌ చేరుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.  
     
మరిన్ని వార్తలు