గ్రేటర్‌లో మూడు ముక్కలాట

5 Dec, 2020 09:58 IST|Sakshi

ఫలితం తేల్చని..  ఉత్కంఠ పోరు

పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు కోలుకోలేని షాక్‌..

భాగ్యనగరిలో కమల వికాసం

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. 2016లో నాలుగు సీట్లకే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు ఏకంగా అర్ధ సెంచరీకి అటు ఇటుగా నిలిచింది. 48 స్థానాలు గెలుచుకొని అధికారపార్టీకి ప్రత్యామ్నాయంగా అవతరించింది. అయితే, అనూహ్య ఫలితాల వెనుకఅగ్రనేతల వ్యూహాలు.. స్థానికనేతల సమన్వయం ఆ పార్టీని విజయతీరాలకు చేర్చాయి. పార్టీలో చేరికలు.. అధికారపార్టీపైనవ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చాయి. స్వల్పసమయంలో అగ్రనేతల పర్యటనల ఖరారు, భావోద్వేగ ప్రసంగాలతో టీఆర్‌ఎస్, మజ్లిస్‌ను ఇరుకున పెట్టేలా ఆ పార్టీ అధినేత సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక వర్గం ఓటర్లు కమలంవైపు మళ్లేందుకు కారణమయ్యాయి. (ఫలించిన వ్యూహం.. టార్గెట్‌ 2023)

అమిత్‌షా చరిష్మా, జేపీ నడ్డా,యోగి ఆదిత్యనాథ్, తేజస్వీ సూర్య ప్రసంగాలతో ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకోవడంలోకాషాయదళం సఫలీకృతమైంది. పట్టించుకోలేదనే ఆవేదన, సిట్టింగ్‌ కార్పొరేటర్లపై ఉన్న వ్యతిరేకత ఆ పార్టీ ఓటమికి దారితీసింది. ఈ పరిణామాలే 99 సీట్లు ఉన్న అధికారపార్టీని 55 స్థానాలకు పరిమితం చేశాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. భావోద్వేగ ప్రసంగాలు, అగ్రనేతల ప్రచార హోరుతో భాగ్యనగరంలో తొలిసారి కమలం వికసించింది. (టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సెటిలర్స్‌ తీర్పు)

పాతబస్తీపై మరోసారి పతంగి ఎగిరింది. 2016లో గెలిచిన 44 సీట్లను తిరిగి దక్కించుకొని మేయర్‌ పీఠం సాధనలో కీలకంగా మారింది. అసద్‌ వ్యూహరచన.. అక్బర్‌ వాడి వేడి ప్రసంగాలతో మైనార్టీ ఓటు బ్యాంకును తమవైపే నిలుపుకొన్నారు. అక్కడక్కడా అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా.. ఓవైసీ సోదరుల ప్రచారంతో సీట్లు నిలుపుకుంది. జాంబాగ్‌ స్థానాన్ని కోల్పోయి.. కొత్తగా దాని స్థానే ఘాన్సీబజార్‌ను గెలుచుకుంది.

కిషన్‌.. రాజాసింగ్‌కు అచ్చేదిన్‌ 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈ ఎన్నికలు మధుర జ్ఞాపకంగా మారాయి. తన పరిధిలోనే గణనీయంగా సీట్లు గెలుచుకోవడమేగాకుండా.. ప్రచారపర్వంలోనూ  కీలకంగా వ్యవహరించారు. అలాగే, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తనదైన శైలిలో అలకలు..బెదిరింపులతో పార్టీలో తొలుత వేడి పుట్టించినా.. ఆఖరికి తన నియోజకవర్గంలో సంపూర్ణ ఆధిక్యతను కనబరిచారు. వీరేగాకుండా.. ఓబీసీ మోర్చా లక్ష్మణ్, ఇతర నగర నేతలు కూడా తమ పరిధిలో సత్తా చాటారు.

కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతం! 
గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మట్టికరిచింది. ఆ పార్టీ కేవలం రెండింటితో సరిపెట్టుకుంది. టీఆర్‌ఎస్, మజ్లిస్, బీజేపీ పోరులో పోటీపడలేక చతికిలపడింది. ఆ పార్టీ నేతల మధ్య సమన్వయలోపం, ప్రచారలేమీ, కనిపించని స్టార్‌ క్యాంపెయినర్లతో ప్రజల దరికి చేరలేకపోయింది. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి సెగ్మెంట్లలో మాత్రం రెండు సీట్లను గెలుచుకొని కాస్తోకూస్తో పరువు నిలుపుకుంది. ఈ ఎన్నికల్లో తొలిసారి ఆనేక చోట్ల ఆ పార్టీ డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. ఇక టీడీపీ గ్రేటర్‌లో తుడుచుకుపెట్టుకుపోయింది. సీట్ల మాట అటుంచితే పోటీ చేసిన ఏ స్థానంలో కనీసం డిపాజిట్‌ కూడా రాలేదు. 

ఎమ్మెల్యేలకు కలిసిరాని ఎన్నికలు
ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఈ ఎన్నికలు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాయి. తన పరిధిలోని 11 సీట్లను ప్రత్యర్థి పార్టీ కైవసం చేసుకోవడం ఆయనను ఆత్మరక్షణలో పడేసింది. ఉప్పల్, ముషీరాబాద్‌ ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికలు కలిసిరాలేదు. తమ పరిధిలోని మెజార్టీ డివిజన్లను దక్కించుకోకపోవడం వారిని నిరాశకు గురిచేసింది.   

మరిన్ని వార్తలు