అతడే ఒక సైన్యం.. స్టార్‌గా కేటీఆర్‌

30 Nov, 2020 08:17 IST|Sakshi

వారం రోజులు.. వంద డివిజన్లలో ప్రచారం

30 సభలు, సామాజిక సమావేశాలు, రోడ్‌ షోలు

సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ తరపున..పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్‌ స్టార్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రచార పర్వంలో అన్నీ తానై విస్తృత ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులకు అండగా నిలిచి గెలుపుపై భరోసా కల్పించారు. అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో దూసుకెళ్లిన కేటీఆర్‌..తన ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని శాంతినగర్‌లో ముగించారు. చివరి రోజు జుమ్మేరాత్‌బజార్, పాటిగడ్డలో నిర్వహించిన రోడ్డు షోల్లో బీజేపీ ముఖ్యనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరంలో వారం రోజుల పాటు ఆయన విరామం లేకుండా 15 నియోజకవర్గాలు, 33 ప్రాంతాల్లో రోడ్‌షోలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ప్రతిచోటా కేటీఆర్‌కు జనం నీరాజనాలు పలికారు. ఉదయం వేళల్లో సామాజిక సంఘాలు, డెలవప్‌మెంట్‌ ఫోరంలతో ప్రత్యేక భేటీలు నిర్వహించిన ఆయన..సాయంత్రం వేళల్లో రోడ్డు షోల్లో పాల్గొన్నారు. మొత్తంగా వంద డివిజన్ల ఓటర్లను తన సభల ద్వారా కలుసుకున్నారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా డివిజన్లకు పరిమితం కాగా ప్రచార వ్యూహం, ప్రతిపక్షాలపై విమర్శల దాడి వంటి అంశాల్లో కేటీఆర్‌ కీలకంగా నిలిచారు. (హైదరాబాద్‌ పేరు మార్చేస్తే... బంగారం వస్తదా?)

అభివృద్ధి ఎజెండాతో ముందుకు... 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగర ఓటర్లు అరాచక వాదానికి కాకుండా అభివృద్ధి, సంక్షేమానికి ఓటేయ్యాలంటూ కేటీఆర్‌ ప్రతి సభలో పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా అవతరించిన బీజేపీ దూకుడుగా వెళుతూ ఎంఐఎంతో పాటు టీఆర్‌ఎస్‌ను ఇరుకుపెట్టే యత్నాలను చేసింది. అయితే కేటీఆర్‌ ఎప్పటికప్పుడు బీజేపీ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా వరద సహాయం నిలిపివేత, పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో బీజేపీని నిలువరించే ప్రయత్నం చేసిన కేటీఆర్, ట్యాంక్‌బండ్‌పై పీవీ, ఎన్టీఆర్‌ఘాట్‌లపై ఎంఐఎం చేసిన ఆరోపణలపై కూడా స్పందించారు. ఎంఐఎం తీరును తప్పుబట్టి తమ ఓటు బ్యాంక్‌కు గండిపడకుండా చేసుకోగలిగారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు