హైదరాబాద్‌ పేరు మార్చేస్తే... బంగారం వస్తదా?

30 Nov, 2020 01:45 IST|Sakshi
రాముడి విల్లు: పాటిగడ్డలో ఎన్నికల రోడ్‌షోలో పూలబాణం ఎక్కుపెట్టిన మంత్రి కేటీఆర్‌

పేర్లు మార్చేవాళ్లా? పురోగతి చూపేవాళ్లా?.. ఎవరు కావాలో ప్రజలు ఆలోచించాలి

గ్రేటర్‌ ఎన్నికల్లో హిందుత్వ ఎజెండాను చొప్పించే యత్నం

ఎంఐఎం మాకు మిత్రపక్షం కాదు

అసద్, సంజయ్, మరెవరైనా సరే... మతకలహాలు సృష్టిస్తే ఊచలే

మీడియాతో ఇష్టాగోష్టిలో మంత్రి కేటీఆర్‌

ఎంఐఎం, బీజేపీ మతపిచ్చి పార్టీలు.. హైదరాబాద్‌ ఈ పిచ్చోళ్ల చేతిలో రాయి కావొద్దు. అగ్గి పెట్టడం సులభం, కానీ ఆర్పేదెవరు? విషయం లేనప్పుడు విషం నింపడమే పని. సబ్జెక్ట్‌ లేకుండా మాట్లాడి మమ్మల్ని విలన్‌గా చూపాలనే బీజేపీ ప్రయత్నం.
-కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారిస్తే ఏమొస్తుంది? ఇంటింటికీ బంగారం ఏమైనా వస్తదా? పేర్లు మార్చడం కాదు.. పురోగతి కావాలి. నగర రూపురేఖలు మార్చాలి. పనితీరు మారాలి’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ‘రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో హైదరాబాద్‌ అభివృద్ధికి చేసిన పనులను ప్రజల ముందు పెట్టాం. అభివృద్ధిని కొనసాగించేందుకు మరోమారు ఓటు వేయమని కోరాం. ఎక్స్‌అఫీషియో ఓట్ల అవసరం లేకుండా... టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల మెజారిటీతోనే మేయర్‌ పీఠాన్ని దక్కించుకుం టుంది. ప్రస్తుత గ్రేటర్‌ ఎన్నికల్లో వందకు పైగా డివిజన్లలో కాస్త అటూఇటుగా ఫలితం సాధిస్తాం. బీజేపీకి దేశ ప్రధాని పదవి అప్పగిస్తేనే మార్పు సాధ్యం కాలేదు. గ్రేటర్‌ మేయర్‌ పదవి ఇస్తే ఏం మారుస్తారు. ఇలాంటి వారితో కొట్లాడటం మా దౌర్భాగ్యం’ అని కేటీఆర్‌ అన్నారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో కేటీఆర్‌ ఇంకా ఏమన్నారంటే..

ఎంఐఎంతో పొత్తు లేదు
తెలంగాణలో బీజేపీ పోటీ చేయడం కొత్తేమీ కాదు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఆరు లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. అడపాదడపా బీజేపీ కొన్ని చోట్ల గెలుస్తున్నా స్థిరంగా ఫలితాలు సాధించడం లేదు. గ్రేటర్‌ ఎన్నికల్లో హిందుత్వ ఎజెండాను బలంగా చొప్పించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను హైదరాబాద్‌ ప్రజలు తిరస్కరిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. గతంలో కేంద్రంలో బీజేపీకి పలు సందర్భాల్లో అంశాల వారీగా మేము మద్దతు ఇచ్చినట్లుగానే రాష్ట్రంలో ఎంఐఎం మాకు మద్దతు పలికింది. ఎంఐఎంతో మాకు ఎన్నికల పొత్తు లేదు. మాది సంకీర్ణ ప్రభుత్వం కాదు.
ఆదివారం గోషామహల్‌ నియోజకవర్గంలోని జుమ్మేరాత్‌ బజార్‌లో కేటీఆర్‌ రోడ్‌ షో

మతాన్ని బూచిగా చూపొద్దు
132 కోట్ల దేశ జనాభాలోని 30 కోట్ల ముస్లింలను బూచిగా చూపుతూ పిల్లల్లో మతపరంగా విషం నింపడం దేశానికి మంచిది కాదు. ఎంఐఎంపై బీజేపీ పోటీ చేస్తే మేము వద్దంటున్నామా. మేము కూడా చాలా డివిజన్లలో ఎంఐఎంతో పోటీ పడుతున్నాం. గ్రేటర్‌ ఎన్నికల్లో బిన్‌లాడెన్, అక్బర్, బాబర్‌ ప్రస్తావన ఎందుకు. వారేమైనా హైదరాబాద్‌ ఓటర్లా? బండి సంజయ్, ఒవైసీ లేదా టీఆర్‌ఎస్‌ లీడర్లు ఎవరైనా మతకలహాలు, ఘర్షణలు సృష్టిస్తే ఊచలు లెక్కపెట్టిస్తాం. నగరంలో పెట్టుబడులు, ఉపాధికి అడ్డువచ్చే వారిని ఉపేక్షించేది లేదు. 

ఎన్నికలొస్తేనే వ్యాక్సిన్‌ గుర్తుకొస్తదా?
ప్రధాని మోదీ నగర పర్యటన ప్రపంచ వాక్సిన్‌ హబ్‌ హైదరాబాద్‌ అనే అంశాన్ని తేటతెల్లం చేసింది. బీహర్, గ్రేటర్‌ ఎన్నికలు వస్తేనే వాళ్లకు వాక్సిన్‌ గుర్తుకు వస్తుంది. ఆరేండ్లలో ప్రధాని రాష్ట్రానికి రెండుసార్లు వచ్చారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రధాని రావడాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు.

బండి సంజయ్‌వి పగటి కలలు
గ్రేటర్‌ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రద్దవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం. మధ్యంతర ఎన్నికలకు మేము సిద్దం. మోదీని రద్దు చేయమనండి. ప్రభుత్వం కూలిపోతుందని బండి సంజయ్‌ పగటి కలలు కంటున్నారు. హైదరాబాద్‌ పేరును భాగ్యనగరంగా మారిస్తే ఇంటింటికీ బంగారం వస్తుందా? గతంలో మద్రాస్, అలహాబాద్, ఫైజాబాద్‌ పేర్లు మార్చితే ఏం ఒనగూరింది. మారాల్సింది పేర్లు కాదు.. పనితీరు. యోగి ఆదిత్యనాథ్‌ నుంచి తెలుసుకునే స్థితిలో మేము లేము.

పిచ్చొళ్ల చేతిలో రాయి కానివ్వొద్దు...
‘ఆవుకథ’తరహాలో ‘హిందూ, ముస్లిం, పాకిస్తాన్‌’మినహా బీజేపీకి వేరే అంశాలు ఉండవు. ఎంఐఎం, బీజేపీలు మతపిచ్చి పార్టీలు... హైదరాబాద్‌ ఈ పిచ్చోళ్ల చేతిలో రాయి కావొద్దు. అగ్గి పెట్టడం సులభం, కానీ ఆర్పేదెవరు? విషయం లేనప్పుడు విషం నింపడమే పని. సబ్జెక్ట్‌ లేకుండా మాట్లాడి మమ్మల్ని విలన్‌గా చూపాలనే బీజేపీ ప్రయత్నం హైదరాబాద్‌లో ఫలితాన్ని ఇవ్వదు. ఒకరు సమాధులు కూలగొడుతామంటే ఇంకొకరు మరేదో కూలగొడతామంటారు. కూల్చే వాళ్లు కావాలా.. నిర్మించే వాళ్లు కావాలా?

దేశ ఖజానాకు నిధులు సమకూర్చుతున్నాం
కేంద్రానికి రాష్ట్రం నుంచి చెల్లించిన నిధులన్నీ తిరిగి రావాలని కోరుకోవడం లేదు. తెలంగాణ దేశానికి నిధులు సమకూర్చడాన్ని గర్వకారణంగా భావిస్తున్నాం. యోగి లాంటి వారు కనీసం తెలంగాణకు కృతజ్ఞతలు అయినా చెప్పాలి. బీజేపీకి మేము కూడా మిత్రులమే. రాజకీయాల్లో శత్రువులు ఉండరు. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. దేశ ప్రయోజనాల కోసం రేపు బీజేపీకి సహరించాల్సి వస్తే... సిద్దాంతపరంగా ఏకీభవిస్తే మద్దతు ఇస్తాం. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత మా పార్టీ జాతీయ రాజకీయాలకు సంబంధించిన కార్యాచరణను మీరే చూస్తారు.

వ్యవస్థలను గౌరవించాలి కదా...
ప్రధాని హోదాను తగ్గించడం మాకు ఇష్టం లేదు. రాజకీయ ఉద్దేశంతోనే ఆయన హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారనే విషయం ప్రజలకు తెలుసు. ఎక్కడైనా రాష్ట్రాల్లో కొన్ని మర్యాదలు ఉంటాయి. పాటిస్తే వ్యవస్థకు మంచిది. ఎన్నికల్లో మేము తీరికలేకుండా ఉన్నా ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాం. ప్రధాని, ముఖ్యమంత్రి వ్యక్తులు కాదు.. వ్యవస్థ. దాని గౌరవాన్ని పెంచాలి.

బీజేపీలో వారసులు లేరా?
కుటుంబ రాజకీయాలకు బీజేపీలోనే... రాజ్‌నాథ్‌సింగ్, యడియూరప్ప, వసుంధరాజే, మనేకా వంటి ఎందరో ఉదాహరణలుగా ఉన్నారు. తమ అసమర్థత దాచుకునేందుకు ఇలాంటి అంశాలను బీజేపీ మాట్లాడుతూ ఉంటుంది. నేను సిరిసిల్ల నుంచి ప్రజాస్వామ్యబద్దంగా ప్రతీసారి మెజారిటీ పెంచుకుంటూ విజయం సాధించా. ప్రజలకు ఇష్టం లేకుంటే మమ్మల్ని ఇంటికి పంపుతారు.

కాంగ్రెస్‌ క్షీణదశలో ఉంది
కాంగ్రెస్‌ పార్టీ గురించి ఆ పార్టీ నేతలే చెప్పుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌ దానంతట అదే క్షీణిస్తోంది. ఆ స్థానంలోకి ఎవరు వస్తారో కాంగ్రెస్‌కు సంబంధించిన తలనొప్పి. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఎవరితోనో ఒకరితో మేము కొట్లాడాలి. రోజూ ఒకరితోనే కొట్లాడితే మజా ఏం ఉంటుంది.

హైదరాబాద్‌ మేలుకోరి ఓటేయండి
 టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్ల మీద అక్కడక్కడ అసంతృప్తి ఉన్నా హైదరాబాద్, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈసారి ఓటేయండి. కార్పోరేటర్లకు శిక్షణ, ప్రజల భాగస్వా్మ్యం, వార్డు కమిటీల ద్వారా కార్పోరేటర్ల వ్యవస్థను గాడిలో పెడతాం. ఈసారి పోలింగ్‌ శాతం ఎలా ఉన్నా ప్రజల మద్దతు మాకు ఉంటుంది. అందరూ ఓటింగ్‌లో పాల్గొనండి.

అందరికీ వ్యాక్సిన్‌... ఏడాదిన్నర పట్టొచ్చు
 వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుంది. కోవిడ్‌ వాక్సిన్‌ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాదిన్నర పట్టొచ్చు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు