‘దమ్మున్న లీడర్‌’తోనే పెట్టుబడులు

28 Nov, 2020 01:26 IST|Sakshi
రాయదుర్గంలోని జేఆర్సీ సెంటర్‌లో రియల్‌ఎస్టేట్‌ సమ్మిట్‌లో మంత్రి కేటీఆర్‌

ఇండస్ట్రీ సజావుగా సాగాలంటే శాంతిభద్రతలు ఎంతో ముఖ్యం

ప్రజలపై భారం పడకుండా ఆస్తుల క్రమబద్ధీకరణ

రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌ 2020లో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ (రాయదుర్గం): హైదరాబాద్‌కు మరిన్ని పెట్టుబడులు రావాలంటే దమ్మున్న లీడర్‌షిప్‌ కావాలని, మతాల మధ్య చిచ్చుపెట్టే దుమ్ము రేపే లీడర్లు కాదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఇండస్ట్రీ సజావుగా సాగాలంటే లా అండ్‌ ఆర్డర్‌ లేనిదే సాధ్యం కాదని, ఈ విషయాన్ని హైదరాబాదీలు ఆలోచించాలని కోరారు. ఆరేళ్ల నుంచి ఎటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా చూసిన లీడర్‌ కేసీఆర్‌ అని అన్నారు. 

క్రెడాయ్‌ హైదరాబాద్, ట్రెడా(తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌), తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన రియల్‌ ఎస్టేట్‌ సమ్మిట్‌– 2020లో కేటీఆర్‌ మాట్లాడారు. గత ఆరేళ్లలో హైదరాబాద్‌లో రోడ్లు, ఫ్లైఓవర్లు, కేబుల్‌బ్రిడ్జ్‌.. తదితర మౌలిక వసతులు కల్పించామని, తాగునీటి, కరెంట్‌ సమస్య లేకుండా చూశామని, శివారు ప్రాంతాలకు కూడా తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. భూరికార్డుల సమగ్ర పర్యవేక్షణను అందుబాటులోకి తీసుకొచ్చిన ధరణి.. భవిష్యత్‌లో అన్ని రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌ అవుతుందని అన్నారు. ధరణి వల్ల నిలిచిపోయిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ సాధ్యమైనంత తొందరగా తిరిగి ప్రారంభిస్తామని, దాని పూచీకత్తు తనదని హామీనిచ్చారు. 

ప్రజలపై భారం పడకుండా ఆస్తుల క్రమబద్ధీకరణ
రాష్ట్రప్రజలపై భారం పడకుండా ఆస్తులను క్రమబద్ధీకరిస్తామని, ప్రతి ఇంచు భూమిని కూడా సర్వే చేసి డిజిటలైజేషన్‌ చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ఆస్తులను అన్‌లాక్‌ చేయాల్సిన అవసరం, అన్‌లాక్‌ చేస్తే వేల కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలకు మార్గం సుగమమవుతుందని అన్నారు. వరదలప్పుడు నగరం అతలాకుతలం కావడానికి కారణమైన నాలాలు, చెరువులు, మూసీ నదిని స్ట్రాటాజిక్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా మూడేళ్లలో మారుస్తామని నొక్కిచెప్పారు. 

హైదరాబాద్‌ పాకిస్థాన్‌లో ఉందా..
‘హైదరాబాద్‌ ఏమైనా పాకిస్థాన్‌లోగానీ, చైనాలోగానీ ఉందా....మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నవారి అడ్డమైన వాదనలు 2020లో చెల్లవు. శాశ్వత ప్రయోజనాలతో నగరం ముడిపడి ఉంది. నాలుగు ఓట్ల కోసం రెచ్చగొట్టి వెళితే ఆ నిప్పు ఎవరూ ఆర్పాలి.. మతాన్ని, వర్గాన్ని టార్గెట్‌ చేస్తున్నవారిని బలంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత హైదరాబాదీలపైనే ఉంది. అమెజాన్, అపిల్, ఫేస్‌బుక్, గూగుల్‌ క్యాంపస్‌లు రావడంతో సంబరపడుతున్నాం.. అదే హైదరాబాద్‌ తల్లడిల్లుతుంటే వస్తారా.. ఆలోచించాలి’అని కేటీఆర్‌ అన్నారు. 

‘హైదరాబాద్‌ పేరు మారుస్తామని అంటున్నారు.. భాగ్యనగరం అని పెట్టినంత మాత్రాన బంగారం అయితుందా’అని ప్రశ్నించారు. ·హైదరాబాద్‌లో అభివృద్ధి కావాలో.. అరాచకం రావాలో.. ఆలోచించాల్సిన సమయం ఆసన్నౖమైందన్నారు. గత ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నగరంలో రూ.67 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. . వరదబాధితుల కోసం కేంద్రం కర్నాటకకు ఐదురోజులలో రూ.500 కోట్లు, గుజరాత్‌కు వారంరోజుల్లో రూ.600 కోట్లు ఇచ్చారు. మనకు రూ.1,350 కోట్లు ఇవ్వాలని సీఎం లేఖ రాస్తే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 

ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దు.. బయటకు వచ్చి ఓట్లేయండి
నగరంలో ఓటింగ్‌ శాతం పెరగాల్సిన అవసరం ఉందని, అందుకు ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించు కోవాలని కేటీఆర్‌ సూచించారు. ఇంట్లో కూర్చొని మాట్లాడొద్దని, విమర్శలు చేయవద్దని, అంతా బయటకు వచ్చి డిసెంబర్‌ 1న ఓటు వేసి అభివృద్ధి చేసే టీఆర్‌ఎస్‌ను బలపర్చాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు పి రామకష్ణారావు, ప్రధాన కార్యదర్శి వి రాజశేఖర్‌రెడ్డి, బి ప్రదీప్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, చలపతిరావు, ప్రభాకర్‌రావుతోపాటు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు