ఢిల్లీ నుంచి ఊరికే రాక.. రూ.1350 కోట్లు తెండి

25 Nov, 2020 20:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో నాయకులు దూసుకుపోతున్నారు. ఢీ అంటే ఢీ అంటూ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. కేటీఆర్‌ తనదైన శైలీలో ప్రతిపక్షాలకు కౌంటర్‌లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మోదీ ఇచ్చిన హామీ ప్రకారం 15 లక్షల రూపాయలు వచ్చిన వారు బీజేపీకి ఓటు వేయండి.. రాని వారు మాకు ఓటు వేయండి అన్నారు‌. మార్కెట్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. అర్హులందరికి డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదే అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్ట్‌లు ఏమి ఇవ్వరని తెలిపారు. ఒక పిచ్చోడు ఎన్టీఆర్, పీవీ సమాధులు కులగొట్టాలని అంటాడు.. ఇంకో పిచ్చోడు చాలన్‌లు కడుతా అంటాడు అంటూ పరోక్షంగా ఎంఐఎం, బీజేపీ నేతలకు చురకలంటించారు కేటీఆర్‌. (చదవండి: టీఆర్‌ఎస్‌కు షాక్‌.. కమలం గూటికి స్వామిగౌడ్‌‌)

వరద లాగా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్ర మంత్రులందరికీ హైదరాబాదుకు స్వాగతం అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్‌. ఈ రాక ఏదో, నగరం అకాల వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్నప్పుడు సాంత్వన చేకూర్చడానికి వస్తే బాగుండేది అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే వారు ఉత్త చేతులతో రాకుండా, సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసిన విధంగా నగర ప్రజలకు వరద సాయంగా 1350 కోట్ల రూపాయలు తీసుకువస్తున్నారని ఆశిస్తున్నాను అన్నారు కేటీఆర్.

మరిన్ని వార్తలు