ఎన్డీయే ప్రభుత్వంపై 132 కోట్ల ఛార్జ్‌షీట్లు వేయాలి

24 Nov, 2020 19:53 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధిపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు (కేటీఆర్‌) మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన ముషీరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరేళ్లలో కేంద్రం ఒక్కటంటే ఒక్క పని చేయలేదని ధ్వజమెత్తారు. ప్రకాశ్‌ జవదేకర్‌ తమ ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్‌ వేశారని.. ఎన్డీయే ప్రభుత్వంపై 132 కోట్ల ఛార్జ్‌షీట్లు వేయాలని దుయ్యబట్టారు. ‘‘రూ.67 వేల కోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. హైదరాబాద్‌కు పెద్ద పెద్ద కంపెనీలు, ప్రాజెక్ట్‌లను తెచ్చాం. వరదసాయం రూ.10 వేలను ఆపినోళ్లు.. రూ.25వేలు ఇస్తారా?.6.50 లక్షల మందికి వరదసాయం చేశాం. మిగిలినవారికీ ఇస్తాం. మీ కోసం పనిచేసే వారిని తిరిగి గెలిపించాలని’’  మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. (చదవండి: ‘అసదుద్దీన్‌కి ఆ బిర్యానీ తినిపించాలి’)

‘‘గతంలో మురికినీళ్లు, మంచినీళ్లు కలిసిపోయేవి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మంచినీటి సరఫరా మెరుగైంది. ఏడాదిలోపు కేశవాపురం రిజర్వాయర్‌ను కట్టి చూపిస్తాం. రూ.5కే భోజనంతో పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. వరద సాయంపై కేసీఆర్ లేఖ రాసి 8 వారాలైనా కేంద్రం స్పందించలేదు. ఏ ముఖం పెట్టుకుని బీజేపీ ఓట్లు అడుగుతోంది. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నేతలు వస్తున్నారు. గల్లీ పార్టీ కావాలా..? ఢిల్లీ పార్టీ కావాలో? ఆలోచించుకోవాలని’’ కేటీఆర్‌ అన్నారు. (చదవండి: ఐటీ రంగం కావాలంటే మేము రావాలి : కేటీఆర్‌)

మరిన్ని వార్తలు