హైదరాబాద్‌లో ఎలక్షన్ అంటే హాలిడేలా ఫీలవుతారు

21 Nov, 2020 19:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కష్టించి పని చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గాంధీనగర్‌లో పార్టీ కార్యకర్తలు కాలర్ ఎగురవేసుకుని తిరిగేలా పనులు చేశామని, ప్రతీ ఒక్కరి దగ్గరికి వెళ్లి వినమ్రంగా ఓటు అడగాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఎలక్షన్ అంటే హాలిడేలా ఫీలవుతారని, అలా కాకుండా ఓటర్లను బూత్‌ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. ‘‘ప్రచారానికి సమయం తక్కువగా ఉంది.. ప్రతీ గడపకూ వెళ్ళండి.. ఉత్సాహం ప్రచారంలోనే కాదు.. ఓట్లు వేయించే వరకూ ఉండాలి’’ అని కార్యకర్తలను కార్మోన్ముఖుల్ని చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత మాట్లాడుతూ.. ప్రజలు అడగకముందే పనులు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉందని, ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆటలు సాగవని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా బీజేపీ నేతలపై విమర్శలు సంధించిన కవిత.. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి, హైదరాబాద్ వరదల నేపథ్యంలో కేంద్ర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. అందుకే లక్ష్మణ రేఖ దాటి వచ్చి మరీ బీజేపీ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్ సుఖ్‌నగర్‌లో గతంలో బాంబు పేలుళ్ళు జరిగాయని, అయితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని కవిత తెలిపారు. ‘‘ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ హైదరాబాద్‌కు వస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జి నగరానికి తలమానికమైంది. కేటీఆర్ చెప్పినట్టు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సెంచరీ కొట్టాలంటే మొదటి రన్ ఇక్కడే(గాంధీనగర్‌) కొట్టాలి’’ అని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని, పార్టీ కోసం పనిచేసిన ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు