హంగ్‌ దిశగా.. గ్రేటర్‌ జడ్జిమెంట్‌

5 Dec, 2020 01:46 IST|Sakshi

అతి పెద్ద పార్టీగా టీఆర్‌ఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-48,ఎంఐఎం-44, కాంగ్రెస్‌-2 చోట్ల విజయం సాధించింది. ఇక గ్రేటర్‌ ఎన్నికల్లో నగర ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే  76 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ ఒక్క పార్టీ కూడా 60 దాటలేదు. దాంతో హంగ్‌ తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇక ఎగ్జిట్‌ పోల్స్‌లో టీఆర్‌ఎస్‌ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని ప్రకటించినప్పటికి తాజా ఫలితాల్లో మాత్రం 56 స్థానాలకే పరిమితమయ్యింది. ఎలాగు ఎంఐఎం మద్దతుతో మేయర్‌ పీఠం దక్కించుకోనున్నప్పటికి.. గ్రేటర్‌ ఫలితల్లో‍ టీఆర్‌ఎస్‌కు భారీ పరాజయమనే చెప్పవచ్చు.  జీహెచ్‌ఎంసీ పోరులో బీజేపీ, కారుకు బాగానే బ్రేక్‌ లేసిందనే చెప్పవచ్చు. 2016 ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితైన బీజేపీ తాజాగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానంలో నిలిచింది.

శివారు కాలనీల్లో దూసుకుపోయిన కారు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. కానీ చివరకు మేజిక్‌ ఫిగర్‌ కూడా చేరలేదు. తాజా ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ నగర శివార్లలో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికి సిటీలో మాత్రం దారుణంగా విఫలమయ్యింది. ఎన్ని ఉచిత హామిలిచ్చినా ఓటరు పెద్దగా పట్టించుకోలేదు. ఆరేళ్లలో టీఆర్‌ఎస్‌ సిటీలో పెద్దగా అభివృద్ధి చేసింది ఏం లేకపోగా.. తాజాగా వరదల సమయంలో.. ముఖ్యమంత్రి, మంత్రులు, కార్పొరేటర్లు స్పందించిన తీరు నగరవాసికి నచ్చలేదు. దాంతో కేవలం 56 స్థానాలతో సరిపెట్టాడు. కేసీఆర్‌ ప్రకటించిన 10 వేల రూపాయల వరద సాయం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్‌ ఫలితం టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను స్పష్టం చేసింది. టీఆర్‌ఎస్‌ మీద వ్యతిరేకత వల్లే ఓటింగ్‌ తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలానే కొనసాగితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు కష్టాలు తప్పవంటున్నారు విశ్లేషకులు.

4 నుంచి 48కు ఎదిగిన బీజేపీ
దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ బల్దియాలో కూడా బలంగా తన ప్రభావం చూపించింది. 2016 ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితైమన బీజేపీ ఈ ఎన్నికల్లో ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక గ్రేటర్‌లో బీజేపీ పుంజుకోవడంలో బండి సంజయ్‌ కీలక పాత్ర పోషించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎంఐఎం, అధికార పార్టీ నాయకుల విమర్శలకు కౌంటర్‌లు ఇస్తూ.. కేంద్రం నుంచి రాష్ట్రం పొందిన ప్రయోజనాల గురించి ప్రజలకు తెలుపుతూ.. ప్రచారంలో దూసుకుపోయింది బీజేపీ. ఈ ఎన్నికల్లో మేజిక్‌ ఫిగర్‌ సాధించనప్పటికి రెండో స్థానంలో కొనసాగడం అంటే కమలానికి గెలుపుతో సమానం. ఇక గ్రేటర్‌ ఫలితాలతో తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నయం అని బీజేపీ మరో సారి రుజువు చేసింది. ఇక గ్రేటర్‌ జోష్‌నే కొనసాగిస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కారును కట్టడి చేయగల్గుతుందనడంలో సందేహం లేదు. (చదవండి: షాడో టీమ్స్‌.. ఎత్తుకు.. పై ఎత్తులు!)

పాతబస్తీలో పట్టు నిలుపుకున్న మజ్లీస్‌
ఇక మజ్లీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోన్నక్కర్లేదు. పాతబస్తీలో పతంగి పార్టీకి మంచి పట్టుంది. 40కిపైగా స్థానాల్లో మజ్లీస్‌ విజయం సాధిస్తుందని ముందు నుంచి అంచనా వేసిందే. గత ఎన్నికల్లో ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించగా.. ఈసారి కూడా ఆ స్థానాలను నిలుపుకుంది.

సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన హస్తం
వరుస ఓటములతో సతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి.. గ్రేటర్‌లో కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం రెండు స్థానాలకే పరిమితం అయ్యింది. అధికార పార్టీకి పోటిగా తాము గెలిస్తే ఏకంగా వరద సాయం 50 వేల రూపాయలు ఇస్తామన్నప్పటికి ఓటరు కాంగ్రెస్‌ను లైట్‌ తీస్కున్నాడు. ఇప్పటికి కాంగ్రెస్‌కు కార్యకర్తల బలం ఉన్నప్పటికి పార్టీ నేతల మధ్య విభేదాలు, సమన్వయం లోపం.. ప్రచారానికి అగ్ర నాయకత్వం దూరంగా ఉండటం వంటి అంశాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారాయి. (చదవండి: జీహెచ్‌ఎంసీ ఎన్నికల‌ ఫలితాలపై కంగనా ట్వీట్‌)

బోణీ కూడా కొట్టని తెలుగుదేశం పార్టీ
గెలవమని తెలిసి కూడా 106 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ.. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. ఇక తెలంగాణలో టీడీపీ తన ఉనికిని పూర్తిగా మర్చిపోతే బెటర్‌ అంటున్నారు విశ్లేషకులు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు